పంజాబ్ : అక్టోబరు 5 నుంచి భారత్‌లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. ఇటీవలే బీసీసీఐ ఈ భారీ ఈవెంట్ షెడ్యూల్ ప్రకటించింది. వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఈ వరల్డ్ కప్ పోటీలకు ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో, పూణే, ఢిల్లీ, ధర్మశాల, చెన్నై, బెంగళూరు నగరాలు అతిథ్యమిస్తున్నాయి. అయితే, తమ రాష్ట్రంలో ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ కూడా లేదని పంజాబ్ క్రీడాశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ హయర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బీసీసీఐకి లేఖ రాశారు. భారత క్రికెట్‌కు పంజాబ్ ఎంతోమంది మేటి ఆటగాళ్లను అందించిందని, అలాంటి రాష్ట్రానికి వరల్డ్ కప్ వేదికల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. బిషన్ సింగ్ బేడీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, లాలా అమర్నాథ్, మొహీందర్ అమర్నాథ్, మదన్ లాల్, యశ్ పాల్ శర్మ, శుభ్ మాన్ గిల్ వంటి ప్రతిభావంతులైన క్రికెటర్లను అందించిన రాష్ట్రం పంజాబ్ అని గుర్మీత్ సింగ్ వివరించారు. పంజాబ్‌లో ఒక్క మైదానానికి కూడా వరల్డ్ కప్ మ్యాచ్ ను కేటాయించకపోవడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. ఇది తమ పట్ల వివక్ష చూపించడమేనని పేర్కొన్నారు. పంజాబ్ క్రీడల మంత్రి గుర్మీత్ సింగ్ హయర్ ఇప్పటికే తన అభిప్రాయాలను ఓ వీడియో రూపంలోనూ విడుదల చేశారు.










