ప్రజాశక్తి - అనంతపురం కలెక్టరేట్:ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత అని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ తెలిపారు. 'ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత' అనే అంశంపై అనంతపురంలోని ఐఎంఎ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన చర్చా వేదికకు పలు సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. ప్రజారోగ్య వేదిక ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొండయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గేయానంద్ మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధికంగా నిధులు కేటాయించి మెరుగైన వైద్యం క్షేత్రస్థాయిలో అందేలా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రభుత్వం సిహెచ్‌సిలు, పిహెచ్‌సిలు, ఏరియా ఆస్పత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లు పటిష్ట పరుస్తూ నాణ్యమైన వైద్యం పేదలకు అందేలా కృషి చేయాలని కోరారు. విద్య, వైద్య రంగాల్లో పూర్తిస్థాయి ప్రభుత్వ భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. నేడు వైద్యం ఖరీదైన వస్తువుగా మారిందని, ఈ నేపథ్యంలో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ప్రసూన, డాక్టర్ వీరభద్రయ్య, డాక్టర్ శంకర్, ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్ కొండయ్య, కార్యదర్శి శ్రీనివాసరావు, సామాజికవేత్త నబిరసూల్, ఎల్‌ఐసి నాయకులు రామకృష్ణ, విద్వాన్ విశ్వం విజ్ఞాన కేంద్రం కన్వీనర్ రాజమోహన్, ప్రజాశక్తి బుక్ హౌస్ సిబ్బంది రాయుడు, యుటిఎఫ్ నాయకులు జిలాన్, ఎపిఎంఎస్‌ఆర్‌యు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.










