Oct 04,2023 10:38
  • హాజరు కానున్న సీతారాం ఏచూరి, వి శ్రీనివాసరావు ప్రభృతులు
  • అరుణారుణమయంగా ఉక్కు నగరం పరిసర ప్రాంతాలు

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయంగా సిపిఎం ఆధ్వర్యాన ఈ నెల 5వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు విశాఖలోని కూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద భారీ బహిరంగ సభ జరగనుంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, కిల్లో సురేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.ప్రభావతి, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు, సిపిఎం ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శులు, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, 78వ వార్డు ఉక్కునగరం సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, స్టీల్‌ప్లాంట్‌ కార్మిక నేతలు కెఎం.శ్రీనివాస్‌, రామస్వామి, శ్రీనివాసరాజు మంగళవారం పర్యవేక్షించారు. బహిరంగ సభ ప్రధాన వేదిక, సీటింగ్‌, జనం హాజరు వంటి విషయాలపై చర్చించారు. బ్యానర్లు, స్వాగత ద్వారాలు జెండాలతో ఇప్పటికే ఈ ప్రాంతం అరుణారుణమయంగా మారింది. సిపిఎం ఆధ్వర్యాన గత నెల 20 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకూ ఉత్తరాంధ్ర అంతటా సాగిన ఉక్కు రక్షణ బైకు యాత్ర జనాన్ని ఇప్పటికే కదిలించింది. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజెప్పింది. ఈ క్రమంలో ఈ బహిరంగ సభకు వేలాది మంది తరలి రానున్నారు.
 

                                                  ఉక్కు పరిరక్షణ పోరాటం... స్ఫూర్తిదాయకం

సుమారు మూడేళ్లుగా స్టీల్‌ప్లాంట్‌ను దెబ్బతీసే కుట్రలను మోడీ సర్కారు తీవ్రతరం చేసింది. వాటిని తిప్పికొడుతూ అకుంఠిత దీక్షతో 964 రోజులుగా ఉక్కు కార్మికులు పోరాడుతున్నారు. మరోవైపు స్టీల్‌ ఉత్పత్తికి తమ పోరాటం వల్ల ఏ సమస్యా రాకుండా ముందుకు సాగుతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. దేశంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాలను విక్రయించడం ద్వారా రూ.లక్షల కోట్లును రాబట్టుకుని పబ్బం గడుపుకోవాలని చూసిన మోడీ సర్కారుకు విశాఖ కార్మికవర్గం గట్టిగా ఎదురుతిరుగుతూ పోరాడుతూ వస్తోంది. సొంత గనులు కేటాయించకుండా, ప్లాంట్‌కు వచ్చే రా మెటీరియల్‌ ఐరన్‌ ఓర్‌, కోకింగ్‌ కోల్‌ను అడ్డుకునే కేంద్ర కుట్రలను నిర్విరామంగా తిప్పికొడుతోంది.