- పునరావాస కాలనీల్లో శ్మశాన వాటికల సమస్య
- నిర్వాసితులకు అడుగడుగునా కష్టాలు
ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసి పునరావాస కాలనీలకు తరలివచ్చిన త్యాగదనులకు ఆఖరి మజిలీకీ కష్టాలు తప్పడం లేదు. పునరావాస కాలనీలకు వచ్చి ఏళ్ళు గడుస్తున్నా శ్మశాన వాటికలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పునరావాస కాలనీల్లో శ్మశాన వాటికల సమస్య తీవ్రంగా ఉండడంతో చనిపోయిన తమ వారి అంతిమ సంస్కారాలు నిర్వహించుకోడానికి నిర్వాసితులు అష్టకష్టాలు పడుతున్నారు. రహదారి, నీటి వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి జిల్లా 41.15 కాంటూరు పరిధి తొలి దశలో దేవిపట్నం మండలంలోని 36 గ్రామాలకు దేవిపట్నం, గోకవరం మండలాల్లో 14 పునరావాస కాలనీలు నిర్మించి అక్కడికి తరలించారు. పెద్దభీంపల్లి-2 పునరావాస కాలనీలో 67 ఇళ్లు నిర్మించి 40 గిరిజన కుటుంబాలకు ఇళ్లు కేటాయించారు. పునరావాస కాలనీల్లో శ్మశాన వాటికలు లేవు. నిర్వాసితుల కుటుంబాలలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి మృతదేహాన్ని దేవిపట్నం తీసుకెళ్లాల్సి వస్తోంది. కుళాయి నీరు రెండు రోజులకోసారి ఇస్తున్నారు.ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల పరిధిలోని మొత్తం 19 గ్రామాల నుంచి 1100 కుటుంబాలు పునరావాస గ్రామాలకు తరలివచ్చాయి. సిరివాక గ్రామంలో శ్మశాన వాటికకు సంబంధించి రహదారి లేకపోవడంతో నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. ములగలంపల్లిలోనూ శ్మశాన వాటికకకు రహదారి సమస్య ఉంది. రాచన్నగూడెం పంచాయతీ పరిధిలో నివాసాలు ఉంటున్న శివగిరి గ్రామంలో శ్మశాన వాటికకు సంబంధించి కొన్ని ఇబ్బందులు తెలెత్తడంతో రెవెన్యూ అధికారులు మరోచోట స్థలాన్ని పరిశీలిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండల పరిధిలో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు పునరావాస కాలనీలో నామమాత్రంగా శ్మశాన వాటికకు స్థలం కేటాయించినప్పటికీ కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గురవాయిగూడెం ఆర్ అండ్ ఆర్ కాలనీలో 262 కుటుంబాలకు ఇళ్లు నిర్మించారు. రెండు కిలో మీటర్ల దూరంలో కాలనీ వాసులకు శ్మశాన వాటికకు మూడు ఎకరాల స్థలం కేటాయించారు. శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలేక కాలనీ ప్రజలు అవస్థలు పడుతున్నారు. పట్టణ పరిధిలోని వైఎస్‌ఆర్ కాలనీ సమీపంలో 65 కుటుంబాలకు రమజుజపురం సమీపంలో ఎకరం స్థలంలో శ్మశాన వాటికను నిర్మించారు. అక్కడ అవసరమైన షెడ్డు, నీటి సౌకర్యం లేకపోవడంతో మృతి చెందిన వారి అంత్యక్రియలకు కొవ్వూరు వెళ్లాల్సి వస్తోందని నిర్వాసితులు వాపోతున్నారు. తాడువాయి కాలనీకి దూరంగా శ్మశాన వాటికను నిర్మించారు. నీటి వసతి, రోడ్డు మార్గం లేకపోవడంతో అంత్య క్రియల సమయంలో నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. ముప్పినవారిగూడెం సమీపంలోని చిగురుమామిడి కాలనీ నిర్వాసితులకు శ్మశానవాటిక కోసం రెండు ఎకరాలు భూమిని కేటాయించారు. కానీ శ్మశాన వాటికకు హద్దులు వేయలేదు. ఐదు నిర్వాసిత కాలనీలకు సంబంధించి రెండు ఎకరాల భూమిని మాత్రమే కేటాయించారని, ఇది సరిపోదని నిర్వాసితులు అంటున్నారు. తూటి గుంట నిర్వాసిత గ్రామానికి ఇప్పటికీ శ్మశాన వాటిక కేటాయించలేదని, అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని కాలనీ వాసులు వాపోయారు. రెడ్డి గణపవరం సమీపంలోని తెల్లదెబ్బలు నిర్వాసిత కాలనీకి శ్మశాన వాటిక లేకపోవడంతో గతంలో ఒక వ్యక్తి చనిపోతే రెడ్డిగణపవరంలోని ఒక భూస్వామికి చెందిన భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. బుట్టాయగూడెం మండలంలోని నిర్వాసిత కాలనీలకు 540 కుటుంబాలు, సింగనపల్లి కాలనీకి సంబంధించి 60 కుటుంబాలు, దొరమామిడి రెండు కాలనీలకు సంబంధించి 60 కుటుంబాలు ఇప్పటి వరకు నిర్వాసిత కాలనీలకు వచ్చారు. బుట్టాయగూడెం మండల పరిధిలో 11 పునరావాస కాలనీలు ఉండగా.. వీటిలో 720 కుటుంబాలు నిర్వాసిత కాలనీలకు తరలివచ్చారు. నివాసిత కాలనీలో కష్టాల గురించి ప్రభుత్వం, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసిత కాలనీలకు బడి, గుడి ఏర్పాటు చేయకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల నిర్మాణం కాకపోవడం తమ చిన్నారులను దూరప్రాంతాలకు పంపించడం ఇష్టంలేక వారిని చదువుకు దూరం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి నిర్వాసిత కాలనీలలో పాఠశాలల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని నిర్వాసితులు కోరుచున్నారు. పునరావాస కాలనీలకు వచ్చి ఏళ్ళు గడుస్తున్నా కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని, కనీస వసతులు కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను నిర్వాసితులు కోరుతున్నారు.










