- ఎస్‌ఎఫ్‌ఐ ప్లీనరీలో మాజీ ఎమ్మెల్సీ గేయానంద్
ప్రజాశక్తి-ఆలూరు : కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం (ఎన్‌ఇపి)తీసుకువచ్చి పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేస్తోందని, ఈ విధానం విద్యను ప్రయివేట్ పరం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ 46వ జిల్లా ప్లీనరీ సమావేశాలను కర్నూలులోని ఆలూరు ఇబ్రహీం ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 'ప్రస్తుత విద్యావ్యవస్థ-విద్యార్థులపై ప్రభావం' అనే అంశంపై జరిగిన రాష్ట్ర సదస్సులో గేయానంద్ మాట్లాడారు. గడిచిన 25 ఏళ్లుగా దేశంలో అమలవుతున్న విధానాలతో విద్య, సామాజిక బాధ్యత నుంచి ప్రభుత్వాలు నెమ్మదిగా తప్పుకుని ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. ఎన్‌ఇపిని అమలు చేయడం ద్వారా మతతత్వం జోడించి విద్యను ప్రమాదంలోకి నెట్టారని, విద్యలో అసమానతలు పెరుగుతూ పేదల చదువులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఎన్‌ఇపిలో ఉన్న అంశాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ వేగంగా అమలు చేస్తోందని తెలిపారు. గత ఏడాదిలో ప్రారంభమైన ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాల నుంచి ఒక్కో అంశాన్ని పరిశీలిస్తే పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం, డిజిటల్ బోధన, వర్కు సర్దుబాటు లాంటివి ప్రవేశపెట్టి ఒకే మీడియానికి పరిమితం చేశారని వివరించారు. డిజిటల్ క్లాసురూముల పేరిట ఉపాధ్యాయుల అవసరం లేకుండా ఎన్‌ఇపి ప్రధాన భూమిక పోషించనుందన్నారు. దేశమంతా ఒకే పరీక్షా విధానాన్ని ప్రాథమిక పాఠశాల స్థాయిలో కూడా అమలు చేయనుందని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఎన్‌ఇపిలో భాగంగా గడిచిన విద్యాసంవత్సరంలో విలీన ప్రక్రియలో భాగంగా 3.50 లక్షల మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలలకు వెళ్లిపోయారని తెలిపారు. 37 వేల ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఒక కిలోమీటరు దూరంలోని ఉన్నత పాఠశాలలకు తరలించారని అన్నారు. దీనివల్ల ప్రాథమిక పాఠశాలలు బలహీనపడ్డాయని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ కర్నూలు జిల్లా కార్యదర్శి అబ్దుల్లా అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షులు రంగప్ప, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు మైన, గోవర్ధన్, వినోద్, గిరి, జిల్లాలోని ఆయా మండల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










