Jun 29,2023 21:11

 పిఎస్‌యుగానే కొనసాగించాలి

న్యూఢిల్లీ : కోల్‌ ఇండియాను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని ఆ కంపెనీ ఛైర్మన్‌ ప్రమోద్‌ అగర్వాల్‌ అన్నారు. భవిష్యత్తులోనూ బగ్గు ధరల్లో స్థిరత్వం ఉండాలంటే కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సిఐఎల్‌) పిఎస్‌యుగానే ఉండాలని ఆయన ఓ ఇంటర్యూలో పేర్కొన్నారు. తద్వారా భవిష్యత్తులో బగ్గు ధరల కోసం ప్రత్యామ్నాయ పద్దతి అందుబాటులో ఉంటుందన్నారు. జూన్‌ 30న (నేటి)తో ఆయన పదవీకాలం ముగియనుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థగా, బగ్గు ఉత్పత్తి ప్రయోజనాలను ప్రజలకు పంపిణీ చేసే బాధ్యత కోల్‌ ఇండియాపైనే ఉందన్నారు. సిఐఎల్‌ ఇంధన రంగానికి పర్యాయపదంగా ఉందన్నారు. ప్రస్తుతం సంస్థ బలంగా, స్థిరంగా ఉందన్నారు. ''గత సంవత్సరం అంతర్జాతీయంగా బగ్గు ధరల్లో తీవ్రమైన ధరల పెరుగుదలను చూశాము. అటువంటి పరిస్థితిలో ప్రయివేటు కంపెనీలు కూడా తమ ధరలను పెంచేవి. అయితే, కోల్‌ ఇండియా వంటి పిఎస్‌యుకు అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం లేదు'' అని అగర్వాల్‌ అన్నారు.
ఇటీవల మోడీ సర్కార్‌ కోల్‌ ఇండియాలో 3 శాతం వాటాను ప్రయివేటు శక్తులకు విక్రయించడం ద్వారా రూ.4,185 కోట్లు తన ఖాజానాలో వేసుకుంది. దీంతో సిఐఎల్‌లో ప్రభుత్వ వాటా 63.1 శాతానికి తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో దిగుమతి చేసుకున్న బగ్గు టన్నుకు సగటు ధర రూ.19,324గా ఉండగా.. అదే సమయంలో దేశీయ బగ్గు టన్ను సగటు ధర కేవలం రూ.2,662గా ఉంది. దీంతో పోల్చితే విదేశీ, ప్రయివేటు బగ్గు ధర ఎంత భారీ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. బగ్గు ధర పెరిగితే విద్యుత్‌, అనేక లోహాల ధరలు అమాంతం పెరగనున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం ఎగిసిపడటంతో ప్రజల కొనుగోలు, పొదుపు శక్తి పడిపోనుంది. అది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. 2019-20 నుండి మూడేళ్లలో అగర్వాల్‌ నాయకత్వంలో కోల్‌ ఇండియా ఉత్పత్తి 101 మిలియన్‌ టన్నులు, 113 మిలియన్‌ టన్నులు పెరిగాయి, అదే సమయంలో విద్యుత్‌ రంగానికి సరఫరాలు 121 మిలియన్‌ టన్నులు పెరిగాయి. 2022-23లో కోల్‌ ఇండియా లాభాలు, నికర అమ్మకాలతో పాటుగా మూడు పారామీటర్‌లు వాటి అత్యధిక స్థాయికి చేరుకోవడంలో తనవంతు ప్రయత్నం చేశానని అగర్వాల్‌ పేర్కొన్నారు. దేశంలోని మొత్తం బగ్గు ఉత్పత్తిలో దాదాపు 80 శాతం కోల్‌ ఇండియేదే కావడం విశేషం. కోల్‌ ఇండియా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో ఆత్మవిశ్వాసంతో పోటీని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉందని అగర్వాల్‌ పేర్కొన్నారు.