Sep 23,2023 21:38

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఉపాధ్యాయులపై విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మరోసారి ఫైర్‌ అయ్యారు. విద్యార్థులు వర్క్‌బుక్స్‌ రాయకపోవడం, ఉపాధ్యాయులు కరెక్షన్‌ చేయకపోవడాన్ని సాకుగా చూపి ఉపాధ్యాయులపై మండిపడ్డారు. విజయనగరం జిల్లాలోని విజయనగరం కస్పా హైస్కూల్‌, ఆర్‌కె ప్రాథమిక పాఠశాల, 15వ నంబరు సచివాలయం, డెంకాడ మండలం మోపాడ కెజిబివి పాఠశాలను శనివారం ఆయన పరిశీలించారు. ముందుగా కస్పా హైస్కూలులో ఏడవ తరగతి విద్యార్థుల అకడమిక్‌ స్థాయిని, వారి వర్క్‌బుక్స్‌ను పరిశీలించారు. ఎవరూ సరిగ్గా రాయకపోవడం, ఉపాధ్యాయులు వర్క్‌ బుక్స్‌ కరెక్షన్స్‌ చేయకపోవడాన్ని సాకుగా చూపి ఆగ్రహం వ్యక్తం చేశారు. 38 మంది ఉన్న ఈ తరగతి విద్యార్థుల వర్క్‌బుక్స్‌ సరిచేయలేకపోతే మీరేమి చేస్తున్నారని డిప్యూటీ డిఇఒ, ఎంఇఒ, హెచ్‌ఎంను ప్రశ్నించారు. అనంతరం ఆర్‌కె మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల, ఇప్పిలివీధిలోని సచివాలయాన్ని పరిశీలించారు. బడిమానేసిన విద్యార్థి ఇంటికి వెళ్లి ఓపెన్‌ స్కూలు ద్వారా అక్కడికక్కడే అడ్మిషన్‌ ఇప్పించారు. అనంతరం డెంకాడ మండలం కెజిబివి పాఠశాలను పరిశీలించారు. ఆయన వెంట డిఇఒ లింగేశ్వరరెడ్డి, డిప్యూటీ డిఇఒ వాసుదేవరావు, ఎంఇఒలు ఉన్నారు.