ప్రకాశం : వెనుబడిన జిల్లాగా ప్రకాశం జిల్లా గుర్తింపుపొందాలని, అప్పుడే జిల్లాలో అభివృద్ధి జరుగుతుందని పిడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించాలని, జిల్లా అభివృద్ధికి రూ.10 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని కోరుతూ ... సెప్టెంబరు 10 నుండి 23 వరకు 14 రోజులపాటు 300 కి.మీ మేర చేపట్టిన సిపిఎం పోరుబాట-పాదయాత్ర ఆదివారంతో 8వ రోజుకు చేరింది. ఈరోజు కనిగిరి నుండి పి.సి.పల్లి వైపు పాదయాత్ర ప్రారంభమైంది.
ఈ సందర్భంగా పి.సి.పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఎం సెక్రటరీ సభ్యులు జివి.కొండారెడ్డి మాట్లాడుతూ .... ప్రకాశం జిల్లాలోని 30 మండలాల్లో తాగడానికి కానీ, సాగునీటికి కానీ ఒక్క చుక్క నీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలోని అన్ని సమస్యలపై అధికారులు స్పందించి పరిష్కారం చేయాలని లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
పిడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ... చాలా పాదయాత్రలు పరిమిత సమయంలో జరుగుతున్నాయని, కానీ ఈ సిపిఎం పోరుబాట పాదయాత్ర ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్విరామంగా ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రాలు విడిపోయిన తరువాత కొన్ని జిల్లాలను మాత్రమే వెనుకబడిన జిల్లాలుగా గుర్తించారని అన్నారు. అప్పట్లో అధికార పార్టీ నిర్లక్ష్యం వల్లే ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లాగా గుర్తించబడలేకపోయిందని ఆరోపించారు. వెనుబడిన జిల్లాగా ప్రకాశం జిల్లా గుర్తింపుపొందితే ... కొన్ని పరిశ్రమలు పెట్టడానికి రాయితీలు వస్తాయని అన్నారు. దొనకొండలో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని పెద్ద ఎత్తున అక్కడ పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉందన్నారు. రామాయపట్నంలో ఇంతవరకూ ఓడరేవు పెట్టలేదని ఆరోపించారు. రామాయపట్నంలో ప్రభుత్వ రంగ అధీనంలో అతిపెద్ద ఓడరేవును పెడితేనే ప్రకాశం జిల్లాలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. ఏ ప్రాంతం అభివృద్ధికైనా నీరు కావాలని.. కానీ ప్రకాశం జిల్లాలో ఎక్కడా నీరు లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రకాశం జిల్లాకు ప్రధానమైన వెలుగొండ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టు పూర్తయితేనే కొన్ని లక్షల ఎకరాల భూములకు నీరొస్తుందని అన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కనిగిరిలో కిడ్నీ సంబంధిత స్పెషలిస్టులను నియమించాలని కోరారు. ప్రకాశం జిల్లాలోని అన్ని సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.










