Oct 15,2023 07:52

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఆరోగ్యం ప్రజల హక్కుగా చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజారోగ్య వేదిక కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆ వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి రమణయ్య, టి కామేశ్వరరావు శనివారం లేఖ రాశారు. ఆరోగ్యం అన్నది ప్రజల హక్కుగా ఉండాలని శుక్రవారం నిర్వహించిన వైద్యారోగ్యశాఖ సమీక్షలో సిఎం ప్రకటించడాన్ని తాము అభినందిస్తున్నామని తెలిపారు. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని కూడా చెప్పడం పట్ల హర్షిస్తున్నామని పేర్కొన్నారు. ఇది కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా 'ఆరోగ్య హక్కు'కు ప్రభుత్వం వెంటనే చట్టం చేయాలని కోరారు. దీనిని మేనిఫెస్టోలో కూడా పొందుపరచాలని కోరారు. ఏప్రిల్‌లో రాజస్థాన్‌ ప్రభుత్వం ఆరోగ్య హక్కును చట్టం చేసిందని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్య సమస్యలపై చాలా ఏళ్ల నుంచి క్షేత్రస్థాయిలో ప్రజారోగ్య వేదికగా పనిచేస్తున్నామని తెలిపారు. తమ అనుభవాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని కోరారు. ప్రజారోగ్యంపై చేసే చట్టం, దాని విధివిధానాల రూపకల్పనకై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.