హైదరాబాద్ : బ్యాంక్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రకటించిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. జనవరి 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె చేపడుతున్నట్లు ఇది వరకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పనిదినాలు, నూతన పెన్షన్ విధానం రద్దు, వేతన పెంపు సవరణపై చర్చలకు ఆహ్వానించడం, ఖాళీగా ఉన్న విభాగాల్లో నియామకాలు తదితర డిమాండ్లను పరిష్కరానికి సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు యుఎఫ్‌బియు తెలిపింది. ఉద్యోగుల డిమాండ్లపై చర్చ నిమిత్తం జనవరి 31న బ్యాంకు యూనియన్లతో సమావేశమయ్యేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) అంగీకరించడంతో సమ్మెను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.










