13 ప్రాజెక్టులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :పారిశ్రామిక వేత్తల పట్ల అత్యంత సానుకూలంగా ఉన్నామని, జిల్లాల కలెక్టర్లు, ఎపిఐఐసి, పరిశ్రమల శాఖ మంత్రి,కార్యదర్శి, సిఎస్‌తో సహా అందరూ మిమ్మల్ని(పారిశ్రామికవేత్తలు) చేయి పట్టుకుని నడిపించేందుకు సానుకూలంగా ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.క్యాంపు కార్యాలయంలో బుధవారం సిఎం పరిశ్రమలు,ఆహార శుద్ది రంగంలో 13 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు వర్చువల్‌గా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జిఐఎస్)లో భాగంగా విశాఖలో పరిశ్రమలు నెలకొల్పేందుకు 386 ఎంఓయూలు, రూ.13లక్షల కోట్లు పెట్టుబడులు, 6లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అవన్నీ సాకారం అయ్యేందుకు ప్రతి నెలా వాటిని కార్యరూపం దాల్చేలా అవి అమలయ్యేందుకు సిఎస్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా ఏర్పాటు చేశామని సిఎం వెల్లడించారు. 3 యూనిట్లకు ప్రారంభోత్సవాలు, 9 యూనిట్లకు శంకుస్థాపనలు , ఒక ఎంఓయూపై సంతకాలు కూడా చేసినట్లు సిఎం వెల్లడించారు. రూ.3008 కోట్ల పెట్టుబడితో దాదాపు 7వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. అ 75శాతం స్ధానికులకే ఉద్యోగాలివ్వాలని చట్టం కూడా చేశామన్నారు.
- 3ఎఫ్ ఆయిల్ bపామ్ కంపెనీకి ఎంఓయూ:
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూ చేసుకున్నారు. 3ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి సంజరు గోయెంకా, ఎపిఎఫ్‌పిఎస్ సిఇఓ శ్రీధర్‌రెడ్డి కంపెనీ తరపున పాల్గన్నారు. రూ.250కోట్లతో 50 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఫ్యాక్టరీ ద్వారా సుమారు 1500మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గంటకు 60 టన్నుల ఉత్పత్తిసామర్ధ్యం, 25వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుచేస్తున్న రైతులకు ఉపయోగం.
ప్రాజెక్టుల ప్రారంబోత్సవ కార్యక్రమంలో మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి,అమర్‌నాథ్, కెవి ఉషశ్రీచరణ్, ఎపిఐఐసి ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు చిరంజీవి చౌదరి, ఎన్ యువరాజ్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గన్నారు.
- రేపు ఢిల్లీకి సిఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. గురువారం ఉదయం పది గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. అక్కడే 1 జనపథ్ నివాసంలో రాత్రి బస చేస్తారు. 6న ఉదయం 9:45 గంటలకు అక్కడ్నుంచి బయలుదేరి విజ్ఞాన్ భవన్‌కు చేరుకుని వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గంటారు. అయితే సిఎం ఢిల్లీ పెద్దలను ఎవరెవరిని కలుస్తారనేది షెడ్యూల్‌లో లేదు.










