జూబ్లీహిల్స్ (హైదరాబాద్) : ప్రముఖ నిర్మాత అల్లుడి రూ.1.7 కోట్ల పోర్షే కారు చోరీ అయిన గంటలోనే పోలీసులు పట్టుకున్న ఘటన శుక్రవారం ఉదయం జరిగింది.
నిర్మాత దిల్‌రాజు అల్లుడు అర్చిత్‌రెడ్డి నిన్న ఉదయం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు రూ.1.7 కోట్ల విలువైన తన పోర్షే కారులో వెళ్లారు. ఆ కారును హోటల్ దగ్గరే ఆపి లోపలికి వెళ్లి 40 నిమిషాల తరువాత బయటకు వచ్చి చూడగా, కారు కనిపించలేదు. దీంతో వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలానికి వెళ్లిన డీఐ వీరశేఖర్, డీఎస్సై రాజశేఖర్ వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సిబ్బందిని రంగంలోకి దించి సీసీ కెమెరాలను పరిశీలించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు సిగ్నల్ జంప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే కేబీఆర్ ఉద్యానవనం వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేసి ఆ కారును ఆపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి తాను ఆకాశ్ అంబానీ వ్యక్తిగత సహాయకుడినని, కెటిఆర్ కారు తీసుకెళ్లాలని సూచించారని, తాను తన సహాయకుడు హఅతిక్‌రోషన్ కలిసి కారులో అకాశ్ అంబానీని కలవడానికి వెళ్లాల్సి ఉందంటూ చెప్పుకొచ్చాడు. అతని మాటలు విన్న పోలీసులు అవాక్కయ్యి తలలుపట్టుకున్నారు. అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా మతిస్థిమితం లేదని, బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ సంస్థలో చికిత్స పొందినట్లు గుర్తించారు. నిందితుడు మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు.










