ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్యజిల్లా) : ఐసిడిఎస్ టీచర్ పోస్టుల నియామకంలో రాజకీయ నాయకుల జోక్యం తగదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు చిట్వేలి రవికుమార్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇతర శాఖల నుంచి ఐసిడిఎస్ శాఖకు ఉద్యోగులను బదిలీ చేస్తుండటాన్ని ఆయన ఖండించారు. ఐసీడిఎస్ లో ఖాళీ ఏర్పడ్డ టీచర్ పోస్టులను విద్యార్హతను బట్టి ఆయాలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ అన్నారు. ఐసిడిఎస్ లో పనిచేసే వారికి పదోన్నతులు కల్పించాలని జీఓ ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా రాజకీయ నాయకుల ప్రమేయంతో అధికారులు జీఓను తుంగలో తొక్కడంతో ఆయాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పదోన్నతులు ఐసిడిఎస్ శాఖ అధికారుల అధ్వర్యంలోనే జరగాలన్నారు. అప్పుడే అనేక సంవత్సరాలుగా ఐసీడిఎస్‌లో పనిచేసే చిరుద్యోగులకు న్యాయం జరగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఉన్న ఫళంగా ఇతర శాఖల అధికారులు ఐసిడిఎస్ శాఖపై చేపట్టే పెత్తనాన్ని ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఇతర శాఖల పెత్తనం వల్ల ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను వెంటనే ఉపసంహరించుకోకుంటే సిఐటియు ఆద్వర్యంలో ఆందోళనలను చేపట్టనున్నట్లు ఆయన హెచ్చరించారు.










