Oct 08,2023 20:57

-అది పేలకపోవడంతో తప్పిన ప్రమాదం
-పోలీసుల అదుపులో నిందితుడు
ప్రజాశక్తి- గోరంట్ల రూరల్‌ (ప్రకాశం జిల్లా):శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ కారుపై ఓ వ్యక్తి ఎలక్ట్రికల్‌ డిటోనేటర్‌ విసిరాడు. అది పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసుల కథనం ప్రకారం... గోరంట్లలో ఆదివారం జరిగిన ద్విచక్ర వాహన ర్యాలీలో ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ పాల్గొన్నారు. అనంతరం గడ్డంతండా పంచాయతీలోని కల్లితండాలో 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొనడానికి కారులో వెళ్లారు. తన వాహనం దిగి కొంతదూరం వెళ్లగానే పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఎలక్ట్రికల్‌ డిటోనేటర్‌ను ఎమ్మెల్యే కారుపై విసిరాడు. అది పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు డ్రైవర్‌ సమాచారం మేరకు సిఐ సుబ్బరాయుడు అక్కడికి చేరుకున్నారు. కారు వద్డ పడి ఉన్న డిటోనేటర్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన గణేష్‌ను అదుపులోకి తీసుకొని గోరంట్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకరనారాయణ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలను వెలికితీయాలని కోరాడు. సిఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ నాసన్‌లో రాళ్లు తొలగించే వాహన డ్రైవర్‌గా నిందితుడు గణేష్‌ పనిచేస్తున్నాడని తెలిపారు. ఆదివారం అతిగా మద్యం సేవించి విధులకు వెళ్లడంతో కాంట్రాక్టర్‌ రమణ ఆయనను పనిలో పెట్టుకోలేదన్నారు. దీంతో, గణేష్‌... సోమందేపల్లి మండలం నుండి వాహన ర్యాలీకి వస్తున్న ద్విచక్ర వాహనంపై వచ్చి ర్యాలీలో పాల్గొని తిరిగి కల్లితండాకు వెళ్లాడని తెలిపారు. అక్కడ తన జేబులోని డిటోనేటర్‌ను మద్యం మత్తులో ఎమ్మెల్యే కారుపై విసిరాడని వివరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్‌పి ఎస్‌వి మాధవరెడ్డి, పెనుకొండ డిఎస్‌పి హుస్సేన్‌ పీరా... గోరంట్ల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సిఐతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఎస్‌పి మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు.