హైదరాబాద్: తెలంగాణకు చెందిన కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ దర్శనం మొగులయ్యకు ఎట్టకేలకు ప్రభుత్వం ఇంటి స్థలం పట్టా అందజేసింది. బుధవారం బూర్గుల రామకృష్ణా రావ్ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కిన్నెర మొగులయ్యతో పాటు షూటర్ ఇషా సింగ్‌కు సైతం ఇంటి స్థలం పట్టా అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కేంద్రం కిన్నెర మొగులయ్యకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సమయంలో.. కేసీఆర్ సర్కార్ ఆయన్ని ఘనంగా సత్కరించింది. ఆపై కోటి రూపాయల నజరానాతో పాటు ఇంటి స్థలం పట్టా అందజేస్తామని మాటిచ్చింది.










