- ఒక సీజన్లోనే ఏనుగులు బయటకు వస్తాయి
- పులి వెనక్కు వెళ్లిపోతోంది
- ఎలుగుబంట్లను నియంత్రిస్తాం
- 'ప్రజాశక్తి'తో పిసిసిఎఫ్ ప్రతీప్‌కుమార్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అటవీ జంతువులు జనావాసాల్లోకి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయని, వేసవిలో ఆహారం కోసం, ప్రకృతి సిద్ధమైన సమస్యలతో కొన్ని, దారితప్పి కొన్ని వస్తుంటాయని, వాటి నుంచి ప్రజలను రక్షించడం కోసం, ప్రజల బారి నుంచి వాటిని రక్షించడం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పిసిసిఎఫ్) ప్రతీప్‌కుమార్ తెలిపారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు, ఎలుగుబంట్లు, కాకినాడ జిల్లాలో పులి సంచారం వంటి సంఘటనతో ప్రజల్లో ఒక్కసారి భయాందోళనలు రేకెత్తాయి. దీనిపై పిసిపిఎఫ్ను 'ప్రజాశక్తి' సంప్రదించగా పలు విషయాలు వెల్లడించారు.
వేసవిలోనే జంతువులు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తుంటాయని తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పది ఏనుగుల వరకూ ఉన్నాయని, అవి ఒడిశా నుంచి వలస వచ్చాయన్నారు. గుంపుల్లో ఉండే ఆడ, మగ సమస్యతో మగ ఏనుగును తరిమేస్తాయని, అది మరో చిన్న ఏనుగును తీసుకుని బయటకు వచ్చేస్తుందని, అవే గ్రామాల్లోకి వస్తుంటాయని తెలిపారు. ఒడిశాలో ఆహారానికి సమస్య ఉంటుందని, మన దగ్గర లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఇక్కడకు వస్తున్నాయని వివరించారు. కొన్నిచోట్ల యువకులు వాటి దగ్గరకు వెళ్లి ఫొటోలు తీసుకోవడం వంటి చర్యలకు దిగడంతో బెదిరిపోయి చంపేస్తున్నాయని వివరించారు. చిత్తూరు, పలమనేరు ప్రాంతాల్లో కౌండిన్య ఏనుగుల ప్రాంతం ఉందని, అక్కడకు తమిళనాడు, కర్ణాటక అటవీ ప్రాంతాల్లోంచి ఎక్కువగా వస్తుంటాయని తెలిపారు. వాటి నివారణకు విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా ధ్వంసం చేసి మరీ వస్తున్నాయన్నారు. వేసవిలో నీటి సమస్య ఎక్కువగా ఉండటంతో అవి జనావాసాల్లోకి వస్తున్నాయని వెల్లడించారు.
పులులు రావడం అరుదు
జనావాసాల్లోకి పులులు రావడం అరుదని, ప్రసుత్తం కాకినాడలో గుర్తించిన పులి చత్తీస్‌గఢ్ నుంచి వచ్చినట్లు తెలిపారు. జార్ఖండ్‌లో వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్కు ప్రస్తుత పులి కాలిగుర్తులు, ఫొటోలు పంపగా, అక్కడి రికార్డుల్లో లేదని తెలిపారు. అయితే ఇది అనంతగిరి, శృంగవరపుకోట మీదుగా పత్తిపాడు వచ్చినట్లు గూగుల్ మ్యాపు ద్వారా గుర్తించామని, మరలా అదేదారిలో వెళ్లిపోతోందని వివరించారు. పులిని మత్తుమందు ఇచ్చి పట్టుకునేందుకు అధికారులకు అనుమతి ఇచ్చామన్నారు. తడోబా నుంచి నిపుణులను కూడా పిలిపించామని తెలిపారు.
జీడికాయల కోసం ఎలుగుబంట్లు
ఎలుగుబంట్లు ఉద్దానం, పలాస దగ్గర ఉంటాయని, అవి ఆయిల్ తాగడంతోపాటు, చీమలను తింటాయని తెలిపారు. అయితే ఇటీవల ఒక వ్యక్తి ఎలుగుబంటి దాడిలో గాయపడి చనిపోయారని పేర్కొన్నారు. జంతువుల దాడిలో గాయపడి చనిపోతే అటవీచట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారాన్ని వారికి అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గాయపడిన వారికి రూ.70 వేల వరకూ ఖర్చుల కోసం ఇస్తున్నామని వివరించారు. జంతువుల కోసం అటవీ ప్రాంతంలో నీటి గుంటల్లో నీటిని నింపుతున్నామని, మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లలేనప్పుడు అక్కడ నింపలేకపోతున్నామని వివరించారు. జంతువులను ఎక్కువగా బెదరగొట్టిన సమయంలోనే ఎదురుతిరిగి దాడిచేస్తాయని తెలిపారు.
అటవీ జంతువుల నుంచి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రజలు కూడా వాటిని గుర్తించిన సమయంలో వెంటనే సమాచారం ఇస్తే రక్షణ చర్యలు తీసుకుంటామని వివరించారు.










