Oct 02,2023 07:56

రాజమండ్రి : అక్రమ అరెస్టును నిరసిస్తూ ... టిడిపి అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో సోమవారం నిరసన దీక్ష నిర్వహించనున్నారు. రాజమండ్రిలోనే ఉన్న చంద్రబాబు భార్య భువనేశ్వరి కూడా ఈ నిరసన దీక్ష చేపట్టనున్నారు. తమకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ... గాంధీ జయంతి రోజున 'సత్యమేవ జయతే' పేరుతో చేపట్టనున్న ఈ నిరసన దీక్షకు రాజమండ్రిలోని స్థానిక క్వారీ సెంటర్‌ సమీపంలోని సుమారు నాలుగు ఎకరాల స్థలంలో రెండున్నర ఎకరాల్లో టిడిపి నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి విద్యానగర్‌లో బస చేసిన కేంద్రం నుంచి భువనేశ్వరి సోమవారం ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సమీపంలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి క్వారీ సెంటర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షాస్థలికి 10 గంటల సమయానికి చేరుకుని 'సత్యమేవ జయతే' దీక్షలో ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూర్చుంటారు. ఈ దీక్ష విరమణ తరువాత ఆమె ప్రసంగిస్తారు.