ప్రజాశక్తి-చిత్తూరు : మోడీఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కులు, ప్రజా రక్షణకు మరో చారిత్రాత్మక పోరాటం నిర్వహించాల్సిన సమయం వచ్చిందని సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు అన్నారు. మంగళవారం సిపిఎం కార్యాలయంలో జిల్లా సమావేశం జరిగింది. కె.సురేంద్రన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ.. ఎమర్జెన్సీకాలంలో నాయకులను జైళ్లలో పెట్టినప్పుడు, 1984లో ఎన్‌టిఆర్‌ను అప్రజాస్వామికంగా పదవీచ్యుతుడిని చేసినప్పుడు.. ఇలా అనేక సందర్భాల్లో చారిత్రాత్మక ఉద్యమాలు ఆవిర్భవించాయని ప్రజాసామ్య హక్కులను, ప్రజా ఉద్యమాలను రక్షించుకునేందుకు నవంబరు 7వ తేదీన 'ప్రజా రక్షణ భేరి' ద్వారా సిపిఎం సన్నద్ధమైందన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతితో ప్రారంభమై నవంబర్ 7 సోవియట్ విప్లవ దినోత్సవం వరకు ఇది సాగుతుందన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు హరించివేయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాలపై దాడులు, నిర్బంధాలు పెరిగిపోయాయని చెప్పారు. ఇందుకు పాలకులు నిఘా వ్యవస్థలను సైతం వినియోగించుకుంటున్నారని అన్నారు. హిట్లర్ కూడా తన నిఘా వ్యవస్థ ద్వారా మారణహౌమం సష్టించాడని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రమాదంలో పడిరదన్నారు. రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి చేస్తోందన్నారు. దీనికి ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై కేంద్రం పెత్తనమే నిదర్శనమన్నారు. ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ఇడి, సిబిఐ, ఐటి దాడుల ద్వారా విపక్ష నేతలను భయపెట్టడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో విస్తరణకు బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. పదేళ్ల క్రితం పార్లమెంట్‌కు వచ్చిన మహిళా బిల్లును సమర్థించని బిజెపి...ఇప్పుడు దానిని ఆమోదించి తన గొప్పగా చెప్పుకుని లబ్ధిపొందాలని చూస్తోందన్నారు. కానీ మహిళా చట్టాన్ని మాత్రం వెంటనే అమలు చేస్తామని చెప్పలేకపోతోందన్నారు. దీంతో ఈ చట్టం ఎప్పుడు అమలులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. యువతరంలో ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ప్రజల ఆలోచనను మూఢనమ్మకాల వైపు మళ్లిస్తోందన్నారు. మూఢనమ్మకాలను సాంకేతిక విజ్ఞానంతో మిళితం చేస్తోందన్నారు. మణిపూర్ ఘటనలు, రెజ్లర్ల ఆందోళనలపై నోరుమెదపని ప్రధాని మోడీ.. సనాతన ధర్మంపై ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఆగమేఘాల మీదు విరుచుకుపడ్డారని అన్నారు. వివక్ష, అణచివేతకు ప్రతిరూపమే సనాతన ధర్మమన్నారు. కానీ బిజెపి సనాతన ధర్మం పేరుతో వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు మతాల మధ్య చిచ్చు రేపుతోందని విమర్శించారు. ప్రజాస్వామిక చట్టాలను ఉల్లంఘిస్తోందన్నారు. 'ఇండియా ఐక్య వేదికను చూసి ఓటిమోత మోగుతున్న బిజెపి చివరకు దేశంపేరునే మార్చడానికి సిద్ధమైందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ మోడీ వత్తాసుతోనే జగన్ ప్రజలపై భారాలు మోపుతున్నాడని, అడ్డగోలు పాలన సాగిస్తున్నాడని మోడీని ఓడిస్తేనే జగన్ పాలన అంతమవుతుందని చెప్పారు. టిడిపి పతనమే బిజెపి లక్ష్యమన్న వాస్తవాన్ని గుర్తించకుండా మోడీ వెంటపడుతోందని విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బిజెపి మింగేసిందన్నారు. కేంద్రం వత్తిడికి తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అనేక రూపాల్లో విద్యుత్ భారాలు మోపుతోందని విమర్శించారు. స్కిల్ స్కాం కేసులో బిజెపి సహకారం లేకుండా టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేసే పరిస్థితిలేదన్నారు. ఈ స్కాంపై ముందుగా ఉప్పందించిన బిజెపి...ఆ తర్వాత తమకు సంబంధంలేనట్లుగా నటిస్తోందన్నారు.
జగన్, అదానీ ఎందుకు కలిశారు? తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకు అన్నట్టుగా ఉంది అదానీ, జగన్ కలయికపై వైసిపి స్పందన. అదానీ రహస్యంగా వచ్చి జగన్‌ను కలుసుకోవడంలో రాష్ట్ర వనరుల్ని, సంపదను కాజేయడానికేనని విమర్శించారు. దీనిపై జగన్ నోరు విప్పాలని, వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 28 న జరిగే ప్రజారక్షణ భేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిపిఎం నాయకులు గిరిధర్ గుప్తా, బాలసుబ్రమణ్యం, వరలక్ష్మి,దాములతో పాటు తదితరులు
పాల్గొన్నారు.










