ప్రకాశంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్
సురక్ష క్యాంపుల్లోనే వికలాంగుల సర్టిఫికెట్లు జారీ
- జగనన్న ఆరోగ్య సురక్షపై ప్రతి వారం సమీక్ష : ముఖ్యమంత్రి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:రక్త హీనతతో ఉన్నవారిని గుర్తించిన అనంతరం వారికి పౌష్టికాహారం అక్కడే అందించేలా ఎస్‌పిఒ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తిరుపతి తరహాలోనే చిన్న పిల్లల కోసం అత్యాధునిక వైద్య సౌకర్యం కలిగిన ఆస్పత్రులను విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్షపై వైద్యారోగ్యశాఖాధికారులతో సిఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాల్లో కూడా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టతో పాటు వైద్యారోగ్యశాఖ ప్రతిష్టను కూడా పెంచుతుందన్నారు. క్యాంపుల ద్వారా రోగులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందాలన్నారు. రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు మెరుగ్గా ఉండేలా చూసేందుకు కలెక్టర్లకూ ప్రత్యేక ఆదేశాలివ్వడంతోపాటు నిధులు కూడా ఇవ్వాలని సిఎం ఆదేశించారు. హెల్త్ క్యాంపులను నిర్వహించడమే కాకుండా చికిత్స అవసరమని గుర్తించిన వారి ఆరోగ్యం మెరుగుపడే వరకు చేయి పట్టుకుని నడిపించాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పాత పేషెంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. చికిత్స అనంతరం వాడాల్సిన మందులు అతి ఖరీదైనా సరే వారికి అందించాల్సిన బాధ్యత ఉందని, క్రమం తప్పకుండా వారికి చెకప్‌లు చేసే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాకుండా గతంలో చికిత్సలు చేయించుక్ను పాత రోగులకు చేయూత అందించడం బాధ్యత అని సిఎం పేర్కొన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ఇలా పాత రోగులు ఎవరెవరు ఉన్నారనే వివరాలు తీసుకోవాలన్నారు. నెలలో మండలంలో నాలుగు సచివాలయాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు. ఆరోగ్య సురక్షపై ప్రతి వారం క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలన్నారు. ఆర్యోగశ్రీని ఎలా వినియోగించుకోవాలో తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదని, ఆరోగ్యశ్రీ చికిత్సల కోసం వెళ్లే రోగులకు ప్రయాణ ఛార్జీలు కూడా ఇవ్వాలని అధికారులకు సిఎం సూచించారు. క్యాంపులకు తప్పనిసరిగా నలుగురు డాక్టర్లు వెళ్లాలని, అందులో ఇద్దరు స్పెషలిస్టులు ఉండేలా చూడాలని అన్నారు. వికలాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలోనూ మార్పులు రావాలన్నారు. నిపుణులైన వైద్యులు ఆరోగ్య సురక్ష శిబిరాలకు వస్తున్న సందర్భంలో అక్కడే సర్టిఫికెట్లు జారీ చేసేలా ఆలోచన చేయాలన్నారు. కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణాల పనుల్లో పురోగతిని సిఎంకు అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సిఎస్ కెఎస్ జవహర్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ స్పెషల్ సిఎస్ (ఎఫ్‌ఎసి) అజరుజైన్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి (కోవిడ్-19) మంజు డిహోస్మణి, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టరు జె నివాస్ హాజరుకాగా, వైద్యారోగ్యశాఖ స్పెషల్ సిఎస్ ఎమ్‌టి కృష్ణబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.










