గతేడాది వచ్చిన 'నాంది' చిత్రంతో హిట్ కొట్టి హీరోగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు అల్లరి నరేశ్. గమ్యం, మహర్షి, నాంది చిత్రాలతో నటుడిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. విలక్షణ నటుడిగా ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. తాజాగా హీరోగా తెలుగు సినీ ఇండిస్టీలో 20 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇటీవల నరేష్ పుట్టిన రోజు సందర్భంగా 'ఇట్లు మారేడిమిల్లి' పోస్టర్‌ను ఆవిష్కరించారు. అంతేకాదు.. ఈ 20 ఏళ్లలో 60 చిత్రాల్లో హీరోగా నటించిన ఇప్పటి జెనరేషన్‌లో రికార్డు క్రియేట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఆయన గురించిన
మరిన్ని విశేషాలు...
సినీ ఇండిస్టీలో హీరోల వారసులే కాదు.. దర్శకులు తనయులూ సత్తా చాటిన వాళ్లున్నారు. అలాంటి వాళ్లలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ రెండో కుమారుడు. 2002లో వచ్చిన 'అల్లరి' చిత్రంతో వెండితెరపై మెరిసి ఇండిస్టీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాలో తన నటనతో మెప్పించారు. అంతేకాదు తొలి సినిమా టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకొని అల్లరి నరేష్ అయ్యారు.
హాస్య చిత్రాలకు పెట్టింది పేరైన అల్లరి నరేష్ కేవలం కామెడీ చిత్రాలే కాదు.. యాక్టింగ్‌కు అవకాశం ఉన్న పాత్రలతో నటుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం హీరోగా చేస్తూనే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేస్తున్నారు. అంతేకాదు గతేడాది 'బంగారు బుల్లోడు'గా పలకరించి నిరాశపరిచినా.. ఆ తర్వాత 'నాంది' సినిమాతో నటుడిగా ఎలాంటి కామెడీ లేకుండా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సుడిగాడు తర్వాత హిట్ ట్రాక్ ఎక్కారు నరేష్.
సక్సెస్ ట్రాక్‌కి 'నాంది'..
'నాంది' చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన అల్లరి నరేష్..ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం హిందీలో కూడా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హిందీలో అజరు దేవ్‌గన్ చేస్తున్నారు. మొత్తానికి 20 ఏళ్లలో 58 చిత్రాల్లో హీరోగా నటించి, ఇప్పటి జెనరేషన్‌లో రికార్డు క్రియేట్ చేశారు. ప్రస్తుతం 'సభకు నమస్కారం', ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం' సినిమాలతో 60వ సినిమా మైలురాయి అందుకోనున్నారు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా 'ఇట్లు మారేడిమిల్లి' పోస్టర్‌ను విడుదల చేశారు.
తండ్రి ఆలోచనను తలకిందుల చేస్తూ..
చిన్నప్పటి నుంచి నరేష్ తెలివితేటలు చూసి తనలా దర్శకుడు అవుతాడనుకున్నారట ఇ.వి.వి. ఆ ఆలోచనలను తలక్రిందులు చేస్తూ నటుడిగా స్థిరపడ్డారు. టాలీవుడ్‌లో ప్రజెంట్ జనరేషన్‌లో హాస్య చిత్రాలకు ఐకాన్‌గా మారారు అల్లరి నరేష్. మొదట నరేష్ కూడా మెగాఫోన్ పట్టి తండ్రి బాటలో దర్శకుడు కావాలనుకున్నాడు. అయితే తన సినిమాలో హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలూ నరేశ్‌లో ఉన్నాయని భావించిన రవిబాబు తన 'అల్లరి'లో అతడినే హీరోగా ఎంచుకున్నాడు. దీంతో అనుకోకుండా అభినయం వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. కేవలం కామెడీతోనే కాదు వీలు దొరికితే అభినయంతోనూ అలరిస్తానని పలుమార్లు నిరూపించుకున్నాడు నరేశ్. మహేశ్‌బాబు 'మహర్షి'లో హీరో స్నేహితుడు రవిశంకర్ పాత్రలోనూ నరేశ్ ఆకట్టుకున్నాడు.
కంటెంట్ బాగుంటే ఆదరిస్తారు..
'ప్రేక్షకులు మారారు. అందుకు తగ్గట్టుగా మేం మారకపోతే తిరస్కారానికి గురవుతాం. ''నాంది'' నాకు కొండంత బలాన్నిచ్చింది. వరుసగా కామెడీ కథల్లోనే నటించడంతో చేసిందే చేసినట్టు అనిపించింది. సీరియస్ కథని నాపైన చూస్తారని 'నాంది' దర్శక, నిర్మాతలు నమ్మారు. అందుకే అంత పెద్ద విజయం. సినిమా ఏదైనా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే అలాంటివి ఎంపిక చేసుకుంటూ వెళుతున్నా. కెరీర్‌లో 72 గంటలు ఏకధాటిగా పనిచేసిన సందర్భాలూ ఉన్నాయి.' అని ఓ ఇంటర్వ్యూలో నరేష్ చెప్పుకొచ్చారు.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెళ్లిపోవచ్చన్నారు...
''మహర్షి' తర్వాత 'ఇక నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్టుగానే వెళ్లిపోవచ్చు' అని ఓ ప్రొడ్యూసర్ అన్నారు. 'నాంది' హిట్ తర్వాత శుభాకాంక్షలు చెప్పారు. ఆ ప్రొడ్యూసర్ నా మంచి కోసమే చెప్పి ఉండొచ్చు. అయితే ఎవరి కెరీర్ ఎప్పుడు, ఎక్కడ ముగిసిపోతుందో ఎవరూ నిర్ణయించలేరు. ఎవరి కెరీర్‌ని ఎవరూ డిసైడ్ చేయలేరు. ఎందుకంటే.. కెరీర్ మధ్యలో 'నేను', 'ప్రాణం' వంటి సీరియస్ సినిమాలు చేశాను. ఇవి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే 'నేను' చూసి, దర్శకుడు క్రిష్ 'గమ్యం'లోని గాలి శీను క్యారెక్టర్‌కు తీసుకున్నారు. గాలి శీనుతో నాకు 'శంభో శివ శంభో' సినిమా చేసే అవకాశం వచ్చింది. 'గమ్యం, శంభో శివ శంభో'లో చేసిన క్యారెక్టర్స్ వల్ల ఎమోషన్‌ను కూడా చేయగలనని మేకర్స్ నన్ను నమ్మారు. ఈ సినిమాల వల్ల 'మహర్షి'లో చేసే ఛాన్స్ వచ్చింది. తద్వారా 'నాంది'లో నటించా' అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పేరు : అల్లరి నరేష్
అసలు పేరు : ఈదర నరేష్
పుట్టిన తేదీ : జూన్ 30, 1982
పుట్టిన ప్రాంతం : చెన్నరు
నివాస ప్రాంతం : హైదరాబాద్
చదువు : బీ.కాం
భార్య : కంఠమనేని విరూప
పిల్లలు : అయానా ఇవికా
తల్లిదండ్రుల : ఇవివి సత్యనారాయణ, సరస్వతీ కుమారి
తోబుట్టువులు : ఆర్యన్ రాజేష్