- పోలవరం నిర్వాసితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : పోలవరం నిర్వాసితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరపూరిత నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ 11 శాతం మాత్రమే ఇచ్చాయి. నాడు టిడిపి, నేడు వైసిపి ప్రభుత్వం గడువు తేదీలు ప్రకటించి మభ్యపెట్టాయి. 2005లో అప్పటి ప్రభుత్వం భారీ అంచనాలతో పోలవరం పనులు ప్రారంభించింది. ముంపు గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలకు పరిహారం, పునరావాసం కల్పించడానికి అధికార యంత్రాంగాన్ని ఆదివాసీ పల్లెలకు పంపింది. రూ.34 వేల కోట్లకుపైగా అంచనా వ్యయం వేయగా తాజా అంచనాల ప్రకారం అది రూ.50 వేల కోట్లు దాటింది. ప్రాజెక్టు కోసం భూములిచ్చిన నిర్వాసితులకు పునరావాసం, పరిహారం చెల్లించిన తర్వాతే నిర్మాణం చేపట్టాలని చట్టాలు చెబుతున్నాయి. ఈ నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోదాట్లో తొక్కేశాయి. ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ బిజెపి ప్రభుత్వం మాట మార్చింది. కేంద్రాన్ని నిలదీయడంలోనూ, ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నిధులు సాధించడంలోనూ టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ ప్రాజెక్టుకు 41.15, 45.75 కాంటూరు లెక్కలు వేసి ముందుకు సాగారు. నాడు ప్రాజెక్టు కోసం 1,67,765 ఎకరాల భూమి అవసరమని అధికారులు లెక్క తేల్చారు. దాదాపు రెండు దశాబ్దాల్లో 1,13,119 ఎకరాలు సేకరించారు. నాటి ఉభయగోదావరి జిల్లాల్లో 1.06 లక్షల కుటుంబాలను నిర్వాసిత జాబితాలోకి తెచ్చారు. ఇప్పటికి 11,677 (11 శాతం) మందికి మాత్రమే పునరావాసం కల్పించారు. తొలిదశ 41.15 పరిధిలోని సుమారు 20 వేల కుటుంబాలదే తమ బాధ్యతంటూ గతేడాది వరద బాధితులను పరామర్శించేందుకు చింతూరు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించడం పోలవరం నిర్వాసితులను మరింత ఆందోళనకు గురిచేసింది.
- అమలు కాని ముఖ్యమంత్రి హామీలు
ప్రతిపక్ష నేతగా 2019కి ముందు జగన్ పాదయాత్రలో పోలవరం ముంపు మండలాల్లో పర్యటించారు. గతంలో ఎకరాకు రూ.1.25 లక్షలు, రూ.1.40 లక్షలు, రూ.1.50 లక్షలు చొప్పున భూ పరిహారం ఇచ్చారని, దీనివల్ల నిర్వాసితులకు అన్యాయం జరిగిందని, మరో రూ.5 లక్షలు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.6.30 లక్షలకు బదులు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. గ్రామాలు ఖాళీ చేసే నాటికి 18 సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కరికీ యూత్ ప్యాకేజీ ఇవ్వాలనే నిర్వాసితుల డిమాండ్‌ను పాలకులు పట్టించుకోవడం లేదు. మరోవైపు జాబితాల పేరుతో జరిగిన కాలయాపనతో దళారుల జోక్యం పెరిగింది. దేవిపట్నంలో మండల స్థాయి రెవెన్యూ అధికారిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ అవినీతిలో పాలనా యంత్రాంగం దళారులతో కుమ్మక్కైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దళారులతో ఇబ్బందుల పాలవుతున్నా, అధికారుల నిర్లక్ష్యంతో తంటాలు పడుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు చొరవ తీసుకోలేక పోయారనేదే ఇప్పుడు అందరి ప్రశ్న. కనీసం మంత్రులుగానీ, ఎమ్మెల్యేలుగానీ తమ బాధను తీర్చేందుకు ఎక్కడా అధికారులతో సమీక్షలు జరపడం లేదని, ముఖం చాటేస్తూ వస్తున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. సిఎంకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో పోరాడి పునరాసానికి, పరిహారానికి నిధులు రాబట్టేవారన్నారు. గ్రామసభలు పెట్టడం, పదేపదే తనిఖీలు, సర్వేల పేరిట ఇబ్బందులకు గురిచేస్తుండడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- 30 శాతం మందికే వరద సాయం
గతేడాది జులై నుంచి సెప్టెంబరు వరకూ కొనసాగిన గోదావరి వరద విలీన మండలాలను ముంచెత్తింది. వేలమందిని గూడుకు దూరం చేసింది. ఒక్కో కుటుంబానికీ లక్షల్లో నష్టం వాటిల్లింది. వరద ముంపు తగ్గిన తర్వాత చింతూరులో సభ నిర్వహించి వరద బాధితులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. 'ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రతి ఇంటికీ రూ.10 వేల నష్టపరిహారం నెల రోజుల్లోనే అందిస్తాం' అని ప్రకటించారు. ఆచరణలో కేవలం 30 శాతం మందికి మాత్రమే వరద సాయం అందింది. పూర్తిగా కూలిన ఇళ్లు, గుడిసెలు ఎన్ని, పాక్షికంగా నష్టపోయిన గృహాలెన్ని, గృహోపకరణాలకు వాటిల్లిన నష్టమెంత? నష్టపోయిన ఇతర ఆస్తుల విలువెంత? ఇంట్లో అప్పటికే నిల్వ చేసిన ధాన్యం, ఇతర వాణిజ్య పంటలకు జరిగిన నష్టమెంత? ఏక మొత్తంగా దెబ్బతిన్న రోడ్లు, కూలిన కరెంటు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటి వాటి నష్టమెంతనేది ఇప్పటికీ ప్రకటించలేదు. గోదావరికి వరుసగా మూడుసార్లు వరదలు రాగా, తొలి వరదల్లో మాత్రమే బాధితులకు రెండు వేలు, ఐదు కేజీల బియ్యం, కాసిన్ని కూరగాయలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది.










