Dec 26,2022 08:23

ఏ అక్షరమైతే తలెత్తుకుని దిటవుగా నిలబడమని
తరగతి గదిలో ప్రబోధించిందో
ఆ అక్షరం ఆత్మహత్య గావించుకుంటుంది
వెలిగి పదిమందిని వెలిగించాల్సిన దీపం
కడగొట్టు యాతనలో ఉక్కిరిబిక్కిరి అవుతుంది

పెట్టుబడి దేవుడు ఇప్పుడు తరగతి గదుల్లోకి
ప్రవేశించడం తిరోగమన పురోగతి
ముక్కలు ముక్కలుగా నరికి విచ్ఛిన్నం చేస్తేగాని
శాంతించడు
వాడి సాంకేతికత స్థాపన ప్రక్రియలో నిండా
మునిగి సొంగలు కార్చడమే మన తక్షణ కర్తవ్యం!

భావప్రసార వంతెన కూలే పన్నాగంలో
నువ్వూ నేనూ పావులం
అమాయకత్వమో
తెలివిమీరినతనమో ... ఇంకేదో
చరిత్ర మాత్రం క్షమించదు!
తెలిసో తెలియకుండానో విధ్వంసం వలలో
చిక్కుబడిపోతేపోయేం
నల్లబల్ల చాటున మగ్గిపోతున్న అక్షరాలను
వెలిగించే కాగడాలనే వొదిలేసాం
వాస్తవం కళ్లముందుకొచ్చే సమయానికి
చేతులు కాలేక ఆకులు ముట్టుకుందామంటే
కుదరదు

ఏ స్వరం వూదితే ఆ స్వరానికి గంగిరెద్దుల్లా
తలలూపుతున్నాం తప్ప
వాడైన కొమ్ములతో వాడి పొట్టను చీల్చే
లోచూపునే మరిచిపోయాం
కడుపునిండా సంతృప్తిగా తిని సుఖం తేన్పు తీసి
ముందే అనుకున్న ప్రణాళికను మన మెదళ్లలోకి
ఎక్కించడానికి వాడు కుతంత్రం పన్నాడు

కుతంత్రమేదో స్వతంత్రమేదో గుర్తించడం మానేసి
చాన్నాళ్లయింది మనకు
మధ్య తరగతి సుఖం ఉయ్యాల్లో దొర్లడమే
హాయిగా వున్నట్టుంది

గొయ్యిని వాడే తీస్తాడు
గోతులోకీ వాడే తోస్తాడు
పూడ్చిపెట్టడమే చివరి అంకం
అప్పుడు మనతోపాటే బోరున ఏడ్వడానికి
నల్లబల్ల వుండదు
ఓదార్పునివ్వడానికి సుద్దముక్కలు
మొహం చాటేస్తాయి
అరచేతుల్లో కుదురుగా వొదిగి అమిరిన పుస్తకం
అనాథ బేలచూపులు చూస్తుంది
ఏడున్నర ఇంచీల తెర
విరగబడి విరగబడి నవ్వుతుంది
ఎందరెందరో తలరాతల్ని మార్చిన క్రాంతదర్శీ
వాడనుకుంటున్న చివరి అంకం ఇంకా పూర్తవలేదు
యుద్ధ వాతావరణం సన్నద్ధంగానే వుంది !

(బైజూస్‌ యాప్‌ని వ్యతిరేకిస్తూ..)

- చంపావతి