Sep 22,2023 09:34

బొబ్బిలి (విజయనగరం) : '' తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, పోలీసుల చెర నుంచి బయటపడాలని చంద్రబాబు క్షేమం ఆకాంక్షిస్తూ నా సోదరుడు బేబినాయన చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం '' అని తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం టిడిపి నేత బేబినాయన పాదయాత్రను పోలీసులు అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ... సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ .... రాష్ట్రంలో మంచి రోజులు రావాలని కోరుకుంటూ బబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయం నుంచి సింహాచలం ఆలయం వరకు 120 కిలోమీటర్ల బేబినాయన పాదయాత్ర ఈ రోజు చేపట్టారని అన్నారు. తన సోదరుడు బేబినాయన పాదయాత్రను అడ్డుకోవడంతో పాటు అరెస్ట్‌ చేసి పోలీసులు వాహనంలో తమ ఎక్కడకి తీసుకువెళుతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. ఈ పరిణామంతో కుటుంబంలోను, తెలుగుదేశం కార్యకర్తల్లోను ఆందోళన వ్యక్తం అవుతోందన్నారు. తన సోదరుడికి ఏమి జరిగినా జగన్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. బేబినాయనను వెంటనే పోలీసులు విడుదల చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.