Sep 23,2023 10:27
  • పార్లమెంట్‌ ఉభయ సభల పనితీరు

ప్రజాశక్తి- న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభ రెండూ నిర్ణీత సమయం కంటే ఎక్కువ పని చేశాయి. షెడ్యూల్‌ కంటే ఒకరోజు ముందుగా గురువారం ముగిసిన ఈ ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. ఇది ఈ సమావేశాల్లో ఆమోదించబడిన ఏకైక బిల్లు. 75 ఏళ్ల పార్లమెంట్‌, చంద్రయాన్‌-3పై చర్చలు కూడా జరిగాయి.
 

                                                                              లోక్‌సభలో...

పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ సంకలనం చేసిన డేటా ప్రకారం, లోక్‌సభ నిర్వహణ 31 గంటలకు పైగా జరిగింది. 22 గంటల 45 నిమిషాల షెడ్యూల్‌ కంటే దాదాపు ఎనిమిది గంటలు ఎక్కువ జరిగింది. ఇది లోక్‌సభ పని సమయాన్ని దాని షెడ్యూల్‌ సమయంలో దాదాపు 137 శాతం చేస్తుంది.
 

                                                                               రాజ్యసభలో...

రాజ్యసభ 27 గంటల 44 నిమిషాల పాటు పనిచేసింది. 21 గంటల 45 నిమిషాల షెడ్యూల్‌ చేసిన సమయానికి గానూ, 128 శాతం పనిచేసింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ ఉత్పాదకత 132 శాతం ఉందని సమావేశాల ముగింపులో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. తరువాత దానిని 160 శాతానికి సవరించారు. లోక్‌సభలో ఈ సమావేశాల్లో వాయిదా పడలేదు. రాజ్యసభ మాత్రం దాదాపు గంటన్నర వాయిదా పడింది. ఈ సమావేశాల్లో ఇప్పటివరకు రెండో అత్యధిక ఉత్పాదకత ఉందని డేటా చూపించింది. 2020 వర్షాకాల సెషన్‌లో, లోక్‌సభ దాని షెడ్యూల్‌ సమయంలో 145 శాతం పనిచేసింది.
         లోక్‌సభ ప్రత్యేక సెషన్‌లో 64 శాతం సమయాన్ని చర్చలపై, 33 శాతం శాసనసభ వ్యవహారాలపై వెచ్చించిందని పిఆర్‌ఎస్‌ నివేదిక పేర్కొంది. అదే సమయంలో రాజ్యసభ తన సమయాన్ని 51 శాతం చర్చలకు, 45 శాతం సమయాన్ని ఒక మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించడానికి వెచ్చించింది. సెషన్‌కు సంబంధించిన ఎజెండాలో భాగంగా ఐదు బిల్లులు పరిశీలన, ఆమోదం కోసం జాబితా చేశారు. అయితే, వాటిలో దేన్నీ పరిశీలించలేదు.
         సెప్టెంబరు 19న ప్రవేశపెట్టిన రాజ్యాంగ (128వ సవరణ) బిల్లు మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై లోక్‌సభలో దాదాపు 10 గంటల పాటు చర్చ జరిగింది. చర్చలో 32 మంది మహిళలు సహా మొత్తం 60 మంది సభ్యులు పాల్గొన్నారు. ఎంఐఎంకి చెందిన ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయడం తప్ప దాదాపు ఏకాభిప్రాయంతో బిల్లు ఆమోదించబడింది.
           లోక్‌సభ సెక్రెటేరియట్‌ ప్రకారం, ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై ఆరు గంటల 43 నిమిషాల పాటు చర్చ జరిగింది. ఇందులో 36 మంది సభ్యులు పాల్గొన్నారు. లోక్‌సభలో చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతంపై చర్చ 12 గంటల 25 నిమిషాల పాటు కొనసాగగా, 87 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. పిఆర్‌ఎస్‌ డేటా ప్రకారం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై 12 గంటలకు పైగా చర్చ జరిగింది. లోక్‌సభలో దాదాపు 14 గంటలకు పైగా చర్చలు జరిగాయి.