Feb 27,2023 21:25

అహ్మదాబాద్‌: మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌)-2023 గుజరాత్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా బెత్‌ మూనీ ఎంపికైంది. ఆ ఫ్రాంచైజీ సోమవారం ఓ ప్రకటనలో.. తమ జట్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా మహిళల జట్టు ఓపెనర్‌ బెత్‌ మూనీ ఆరంభ సీజన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు పేర్కొంది. దీంతో ట్విటర్‌ వేదికగా మూనీ.. 2023లో జరిగే చారిత్రాత్మక ఉమెన్స్‌ ప్రిమియర్‌ లీగ్‌ ప్రారంభ ఎడిషన్‌లో గుజరాత్‌ జెయింట్స్‌కు నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను'' అని పేర్కొంది. మహిళల టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో మూనీ 74పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. ఇక మహిళల ప్రిమియర్‌ లీగ్‌ మార్చి 4నుంచి 26వరకు ముంబయి వేదికలుగా జరనున్న సంగతి తెలిసిందే. ఐదు జట్ల మధ్య జరిగే డబ్ల్యుపిఎల్‌లో బెంగళూరు జట్టుకు స్మృతి మంధాన, యుపి జట్టు ఎలిస్సా హీలీ(ఆస్ట్రేలియా)ను కెప్టెన్లుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. ముంబయి ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ తమ కెప్టెన్లను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

  • పునరాగమనానికి గొప్ప వేదిక: పూనమ్‌ యాదవ్‌

ఆటగాళ్లు తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడానికి డబ్ల్యుపిఎల్‌ గొప్ప వేదిక కానుందని భారత మహిళలజట్టు సీనియర్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ అభిప్రాయపడింది. పూనమ్‌ యాదవ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.30లక్షలకు దక్కించుకుంది.
గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు: బెత్‌ మూనీ(కెప్టెన్‌), స్నేహ రాణా(వైస్‌ కెప్టెన్‌), గార్డినర్‌, సోఫియా డంక్లే, సథర్లాండ్‌, హర్లిన్‌ డియోల్‌, డోట్టిన్‌, మేఘ్నా, వేరేహామ్‌, మాన్సి జోషీ, డి. హేమలత, మోనికా పటేల్‌, తనూజా కన్వేర్‌, సుష్మా వర్మ, హర్లే గాలా, అశ్విని కుమారి, పి. సిసోడియా, షబ్నమ్‌ షేక్‌.