Oct 18,2023 09:55

ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు. పోలీసు అధికారుల కథనం ప్రకారం... బీజాపూర్‌ అటవీ ప్రాంతంలోని కొరంజెడ్‌, బందెపారా ఏరియాల్లో 15 నుంచి 20 మంది మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో, డిఆర్‌జి, బస్తర్‌ ఫైటర్స్‌, ఎస్‌టిఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌-170 బెటాలియన్‌కు చెందిన బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ ఇన్‌ఛార్జి డివిసిఎం.నగేష్‌, కార్యదర్శి బుచ్చన్న, ఎసిఎం విశ్వనాథ్‌లతో కూడిన మావోయిస్టుల బృందం తారసపడింది. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు చనిపోయారు. ఆయన పేరు నగేష్‌ అయివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎకె 47 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి.