Sep 23,2023 21:30

ప్రజాశక్తి - చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లంకపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మావోయిస్ట్‌ పార్టీకి చెందిన 'బి' ప్లాటూన్‌ డిప్యూటీ కమాండర్‌ మడకం ఉంగతి ఉంగాల్‌ పోలీసులకు పట్టుబడ్డారు. ఆ వివరాలను అల్లూరి జిల్లా ఎస్‌పి తుహిన్‌ సిన్హా శనివారం చింతూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మడకం ఉంగాల్‌ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో తిరుగుతూ 37 చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. ఆయన 2014 డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా చింతగుప్ప పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని కసాల్పాడు గ్రామంలో జరిపిన దాడిలో 14 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు మరణించారు. 2017 మార్చిలో బుర్కాపాల్‌ గ్రామంలో జరిపిన దాడిలో 25 మంది పోలీసులు మృతి చెందారు. ఇలా పలుమార్లు పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. ఆయనను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు కొంతకాలంగా వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ముందస్తు సమాచారం మేరకు లంకపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఉంగాల్‌ కదలికలపై నిఘా పెంచారు. మందు పాతర అమర్చి పోలీసులను హతమార్చే పనిలో ఉండగా పట్టుకున్నారు. ఆయనతో ఉన్న మావోయిస్టు పార్టీ నాయకులు, సభ్యులు, మిలీషియా సభ్యులు తప్పించుకున్నారు. ఉంగాల్‌ నుంచి రెండు డిటోనేటర్లు, రెండు గ్రెనేడ్లు, కార్డెక్స్‌ వైరు, ఐరన్‌ ముక్కలు, కుక్కర్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. సమావేశంలో పోలీసు అధికారులు కెవి.మహేశ్వరరెడ్డి, ధర్మ ప్రకాష్‌ పాల్గొన్నారు.