- దళిత రక్షణ యాత్రలో శివనాగరాణి
ప్రజాశక్తి - పశ్చిమగోదారి యంత్రాంగం :మతోన్మాద విధానాలను నిరసిస్తూ ఈ నెల 29న విజయవాడలో చేపట్టనున్న మహా ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ వి.శివనాగరాణి కోరారు. కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో చేపట్టిన దళిత రక్షణ యాత్ర రెండో రోజు శుక్రవారం భీమవరం రూరల్, నరసాపురం, యలమంచిలి, పాలకొల్లు మండలాల మీదుగా సాగింది. యలమంచిలి మండలం చించినాడలో మహాధర్నా వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వి.శివనాగరాణి మాట్లాడుతూ... ప్రజల మధ్య అసమానతలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తోన్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. రాష్ట్రంలో అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించి పేదల చేతుల్లో ఉన్న భూములను లాగేసుకుంటున్నారని విమర్శించారు. గ్రామాల్లో పనుల్లేక వ్యవసాయ కార్మికులు వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగులు భూములను దళితులకు పంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బత్తుల విజయకుమార్, కె.క్రాంతిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాతిరెడ్డి జార్జి, జక్కంశెట్టి సత్యనారాయణ, జిల్లా నాయకులు కౌరు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.










