Oct 06,2023 11:40

అమరావతి : నేడు ఉండవల్లి నుండి రాజమండ్రికి బయలుదేరుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ను కలవడానికి వెళుతున్న టిడిపి శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టయిన నేపథ్యంలో ... న్యాయనిపుణులతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన ఆయన కుమారుడు లోకేష్‌ గురువారం రాత్రి గన్నవరం వచ్చారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. శుక్రవారం చంద్రబాబుతో ములాఖత్‌ కానున్నారు. కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు న్యాయవాదులతో జరిగిన చర్చలపై చంద్రబాబుకు వివరించనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా... మార్గమధ్యలో లోకేశ్‌ను కలిసి సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న వారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. లోకేశ్‌ వాహన శ్రేణి వెళుతున్న మార్గంలో పలుచోట్ల భారీగా పోలీసులు మోహరించారు. లోకేశ్‌తో నేతలు, కార్యకర్తలు రాజమహేంద్రవరం వెళ్లకుండా వారి వాహనాలను ఆపేస్తున్నారు. పొట్టిపాడు టోల్‌ప్లాజా వాద్ద మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర వాహనాలను అడ్డుకున్నారు. నేతలు ఎవరూ లోకేశ్‌ వెంట రాజమండ్రికి వెళ్లకూడదనే పోలీసుల ఆంక్షలపై టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. '' రాజమండ్రికి వెళ్లాలంటే జగన్‌రెడ్డి దగ్గర వీసా తీసుకోవాలా ? లోకేశ్‌ను కలవాలంటే తాడేపల్లి ప్యాలెస్‌ అనుమతి కావాలా ?'' అని నిప్పులు చెరిగారు.