'మూడు విమర్శల గ్రంథాల' ఆవిష్కరణలో వక్తలు
ప్రజాశక్తి -అనంతపురం :తెలుగు సాహిత్య రంగంలో నిలువెత్తు సాహిత్య దర్పణం ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి రచించిన 'మూడు విమర్శ గ్రంథాల' ఆవిష్కరణ సభను అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్‌లో శనివారం నిర్వహించారు. రెండు భాగాలుగా ఈ పుస్తక ఆవిష్కరణ సభను నిర్వహించారు. ఉదయం అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షతన 'విమర్శాపునర్నవం', మధ్యాహ్నం 'వర్తమాన తెలుగు సాహిత్య విమర్శ- వివిధ అవరోధాలు' అంశంపై చర్చా సదస్సును నిర్వహించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ విసి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తెలుగుజాతి గర్వించదగ్గ సాహితీవేత్తలలో గొప్ప విమర్శకులుగా రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి ఎప్పటికీ గుర్తుంటారన్నారు. రాయలసీమ సాహిత్యంపై రాచపాలెం ఉత్తమ విమర్శ గ్రంథాలు రచించారని చెప్పారు. అధ్యాపకుడిగా, ఆచార్యునిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకున్నారని తెలిపారు. సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సృష్టికి విమర్శ తప్పనిసరి అన్నారు. తెలుగు సాహిత్యం రెపరెపలాడడానికి ఆచార్య రాచపాలెం వేసిన బాటలు ఎంతో ప్రయోజనకరమైనవని పేర్కొన్నారు. ఏడు పదుల వయస్సులోనూ ఆయన సౌమ్యం, మానవతావాదం సామాజిక అభివృద్ధి వైపు వేస్తున్న అడుగులు, ఆలోచనలు ఎంతో మార్గదర్శకమన్నారు. రాచపాలెం రచనలు సమాజ అభ్యదయానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రాచపాలెం రచనలపై డాక్టర్ శాంతినారాయణ, కొలకలూరి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యులు ఆచార్య గాజులపల్లి రామచంద్రారెడ్డి, నవలా, కథారచయిత బండి నారాయణ స్వామి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎం.గేయానంద్, సిపిఎం అనంతపురం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఎసిఆర్.దివాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










