ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు జిల్లా):తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కి నిధులు మంజూరు చేయించి స్కామ్‌కి పాల్పడ్డారని తనపై నిరాధార ఆరోపణలు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజరు రెడ్డిపైనా, స్కిల్ స్కామ్‌పై ఇడి కొరడా అంటూ అభూత కల్పనలతో కథనం రాసి, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన సాక్షి దినపత్రికపైనా గుంటూరు జిల్లా మంగళగిరి అడిషినల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన క్రిమినల్ కేసులకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట శుక్రవారం వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మంగళగిరి టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తనపై బురదజల్లి వెళ్లిపోతానంటే ఊరుకునేది లేదని, నిరాధార ఆరోపణలు చేసే వారందరిపై న్యాయపోరాటం చేస్తానని లోకేష్ ప్రకటించారు. తాను తప్పులు చేయనని, తప్పుడు ప్రచారం చేసే ఎవ్వరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. అందుకే వరసగా తప్పుడు ఆరోపణలు చేసిన, కట్టుకథలు రాసిన వారందరిపైనా పరువునష్టం దావాలు వేస్తున్నానని తెలిపారు. ఇప్పటి వరకు సివిల్, క్రిమినల్ కలిపి ఎనిమిది కేసులు వేశామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి మరీ టిడిపి కేడర్‌ని ఇబ్బంది పెడుతున్న అధికారులు, మీడియా సంస్థలపైనా న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. యువగళం పాదయాత్రలో సాక్ష్యాలు, ఆధారాలతో వైసిపి నేతలు, ఎమ్మెల్యేల బండారం బయటపెడతానని అన్నారు. రాజధాని అమరావతిలో లిటిగేషన్‌లో ఉన్న భూమిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మేం అధికారంలోకి వస్తే అన్ని రకాల మౌలిక వసతులతో పేదలకు ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పి.అనురాధ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.










