Sep 25,2023 21:05

ప్రజాశక్తి-అమరావతి : విజయవాడలో అంగన్‌వాడీలపై నిర్భందానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ట్రేడ్‌ యూనియన్‌, సిపిఎం నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అరెస్టు చేసిన సిఐటియు రాష్ట్ర నాయకులు వి.ఉమామహేశ్వరరావు, ఎ.వి.నాగేశ్వరరావు, ఎఐటియుసి నాయకులు జి.ఓబులేసు, ఆర్‌.రవీంద్రనాథ్‌, ఐఎఫ్‌టియు నాయకులు పి.ప్రసాద్‌, పోలారి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, వి.వెంకటేశ్వర్లు, సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. వీరితోపాటు గన్నవరం, రాజమండ్రి, చిత్తూరు, అనంతపురం, తదితర జిల్లాల్లో అరెస్టు చేసిన నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని వామపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. . తమ న్యాయమైన కోర్కెల సాధనకు విజయవాడలో అంగన్వాడీలు ధర్నా చేయాలని నిర్ణయించారని, ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ధర్నాకు వచ్చిన మహిళలను ఎక్కడికక్కడ బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో జల్లెడపట్టి అరెస్టు చేయడం గర్హనీయమన్నారు. విజయవాడ నగరంలోనే 3,500 మందిని అరెస్టు చేసి వివిధ స్టేషన్లు, కళ్యాణ మండపాల్లో పెట్టడం అన్యాయమని, విజయవాడకు రాకుండా జిల్లాల్లోనే అరెస్టు చేసి ధర్నాను విఫలం చేయడానికి పూనుకోవడం అప్రజాస్వామికమని తెలిపారు.