- నేడు విధుల బహిష్కరణకు బిబిఎ పిలుపు
ప్రజాశక్తి - విజయవాడ : న్యాయవాదుల ఇళ్లు, కార్యాలయాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) దాడులను ఖండిస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ (బిబిఎ) ఆధ్వర్యంలో విజయవాడలో న్యాయవాదులు మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. బుధవారం విధులు బహిష్కరించి నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు. విజయవాడ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాదులు పిచ్చుక శ్రీనివాస్, టి.ఆంజనేయులు ఇళ్లలో సోదాలు చేయడాన్ని నిరసిస్తూ సివిల్ కోర్టుల ఆవరణలోని బిబిఎ హాలు వద్ద దీక్ష చేపట్టారు. ఫ్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ హక్కులు, న్యాయం కోసం నిలబడే మేథావులు, న్యాయవాదుల ఇళ్లపై దాడులు, సోదాలు చేపట్టడం సరికాదన్నారు. మరో సీనియర్ న్యాయవాది, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఎఎల్) జాతీయ ప్రధాన కార్యదర్శి చలసాని అజరు కుమార్ మాట్లాడుతూ సెక్షన్ 100, 160, 165, 41డి వంటి వాటిని ఉల్లంఘించి ఎన్‌ఐఎ పోలీసులు దాడులు, సోదాలు చేయడం హేయమైన చర్యన్నారు. ఈ దీక్షలకు టిడిపి ఎమ్మెల్సీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంఘీభావం తెలిపారు. దీక్షల్లో న్యాయవాదులు పిచ్చుక శ్రీనివాస్, టి.ఆంజనేయులు, ఎఎస్‌ఎస్.రామ్ ప్రసాద్, బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు చేకూరి శ్రీపతి, పిళ్లా రవి, సంపర శ్రీనివాస్, మన్మధరావు పాల్గొన్నారు.
న్యూస్ క్లిక్ పాత్రికేయుల ఇళ్లపై దాడులకు ఒపిడిఆర్ ఖండన
హక్కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులపై ఎన్‌ఐఎ దాడులను, ఢిల్లీలో న్యూస్ క్లిక్‌కు చెందిన పాత్రికేయుల ఇళ్లపై, సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ఇంటిపై ఢిల్లీ పోలీసుల దాడులను ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఒపిడిఆర్) ప్రధాన కార్యదర్శి వి.హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. అప్రజాస్వామికమైన, అక్రమమైన ఈ దాడులను, అరెస్టులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.










