Oct 17,2023 21:47

- సహజ ఉత్పత్తుల మార్కెట్‌ విస్తృతం : రాజన్నదొర
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :గిరిజన సహకార సంస్థ (జిసిసి) వెబ్‌సైట్‌ను(www.apgirijan.com)  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులు, వినియోగదారులు, ఉద్యోగులకు అవసరమైన శీఘ్ర సేవలు, సమగ్ర సమాచారాన్ని అందించడంతో పాటు జిసిసి సహజ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ దోహదపడుతుందన్నారు. జిసిసి 2022-23లో తన ప్రధాన కార్యకలాపాల ద్వారా రూ.494.25 కోట్లను గిరిజన ఆర్థిక వ్యవస్థలోకి పంపిందని చెప్పారు. రూ.75.56 కోట్ల అటవీ, వ్యవసాయ ఉత్పతులను కొనుగోలు చేసినట్టు తెలిపారు. జిసిసి ప్రగతిలో భాగస్వాములైన ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. జిసిసి వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో జిసిసి అందిస్తున్న సేవలు, ఖర్చు పెడుతున్న నిధులు, ప్రణాళికలు, ఫలితాలు వంటి వివరాలు అన్ని గణాంకాలతో సహా నూతన వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. జిసిసి గిరిజన ప్రాంతాల్లో సేకరించిన ముడి సరుకులతో పారిశ్రామిక యూనిట్లలో తయారుచేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న సహజ ఉత్పత్తులను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పలు సోషల్‌ మీడియా వేదికలను ఈ వెబ్‌సైట్‌తో అనుసంధానించామని చెప్పారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దాండే, డైరెక్టర్‌ జె.మురళి, ట్రైకార్‌ ఎమ్‌డి రవీంద్రబాబు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ చీఫ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.