Oct 04,2023 12:46

అమరావతి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా నోటీసులు ఇచ్చారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పవన్‌ మాట్లాడుతూ ... పెడనలో జనసేన వారాహి సభలో దాడులు చేస్తారని.. దీనిపై విశ్వసనీయ సమాచారం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో... దాడులపై సమాచారం ఉంటే ఇవ్వాలని పవన్‌కు జిల్లా ఎస్పీ నోటీసులు జారీ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఎస్పీ అన్నారు. పెడనలో వారాహి యాత్రకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

                                              పవన్‌కు ఉన్న ఆధారాలను తెలియజేయాలి : పోలీసులు

జనసేన నేత పవన్‌ వ్యాఖ్యలను తాము నిశితంగా పరిశీలించామని ఎస్పీ జాషువా చెప్పారు. వారి పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అయితే పవన్‌ నిన్న చేసిన ఆరోపణలకు ఏదైనా క్రెడిబుల్‌ సమాచారం ఉందనే దానిపై నోటీసులు ఇచ్చామని చెప్పారు. మచిలీపట్నం డీఎస్పీ, పెడన సీఐలు.. పవన్‌ కల్యాణ్‌కు నోటీసు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆ ఆరోపణలు చేసేందుకు పవన్‌కు ఉన్న ఆధారాలను పోలీసులకు తెలియజేయాలని నోటీసులో కోరారు. పవన్‌ చెప్పినట్టుగా ఏదైనా రౌడీ ఎలిమెంట్స్‌, అసాంఘిక శక్తులు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే తాము ఇచ్చిన నోటీసుకు పవన్‌ నుంచి రిప్లై రాలేదని తెలిపారు. పవన్‌ ఆయన వద్ద ఉన్న సమాచారం షేర్‌ చేస్తే.. శాంతియుతంగా వారి కార్యక్రమం జరిగేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే పర్యవసనాలు ఉంటాయని అన్నారు. తమ సమాచార వ్యవస్థ తమకుందని అన్నారు.