కోల్‌కతా: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పరుగుల వేటలో వెనుకబడుతున్నాడు. రెండు టెస్టులు ముగిసిన అనంతరం అతడు నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి చేసింది (20, 17, 1) 38 పరుగులే. టాప్‌క్లాస్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైనా.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అతనికి మద్దతుగా నిలిచాడు. కేఎల్ రాహుల్ మాదిరిగానే మాజీ క్రికెటర్లు ఎందరో ఫామ్ లేమితో బాధపడ్డారని, అలాంటప్పుడే మిగతావారంతా అతనికి మద్దతుగా నిలవాలని చెప్పుకొచ్చాడు. త్వరలో ఇండియన్ ప్రిమియర్‌లీగ్(ఐపిఎల్) జరగనుందని, ఆ సమయానికి కేఎల్ రాహుల్ ఫామ్‌ను అందిపుచ్చుకోవడం ఖాయమన్నాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా రెండేళ్లుగా పరుగులు సాధించడంలో విఫలమయ్యాడని, కానీ ఇటీవలి కాలంలో అతని బ్యాట్ నుంచి పరుగులు జాలువారుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలని పేర్కొన్నాడు. గతంలో కేఎల్ రాహుల్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లపై స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడిన మర్చిపోకూడదని, కానీ తొమ్మిదేళ్ల టెస్ట్ కెరీర్‌లో కెఎల్ రాహుల్ కేవలం 7 సెంచరీలే చేయడంతో అభిమానులు అతనినుంచి మరింత ఎక్కువ ఆశిస్తున్నారని గంగూలీ అన్నాడు. ఈ ఓపెనర్ గతంలో పేసర్లకు మాత్రమే ఔటయ్యేవాడని, కానీ ఇటీవలికాలంలో స్పిన్నర్లు కూడా రాహుల్‌ను ఔట్ చేస్తున్నారని, ఈ క్రమంలో తన ఫామ్‌పై కేఎల్ రాహుల్ దృష్టి సారించుకోవాల్సి ఉందన్నాడు. కేఎల్ రాహుల్ గత 10 టెస్టుల్లో 25పరుగుల మార్క్‌ను దాటలేకపోయాడని, టెస్టుల్లో అతని సగటు కూడా 35.37 మాత్రమేనని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే 43 టెస్టులు ఆడిన కేఎల్ రాహుల్ యువ క్రికెటర్లకు ఆదర్శంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. అలాగే సెలెక్టర్లు, కెప్టెన్, కోచ్.. కేఎల్ రాహుల్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గంగూలీ పేర్కొన్నాడు.
- శుభ్‌మన్‌నుంచి తీవ్ర పోటీ..

కేఎల్ రాహుల్‌కు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌నుంచి తీవ్ర పోటీ ఎదురౌతుందన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న శుభ్‌మన్ తుది 11మంది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకోలేకపోతున్నాడని, ఇందుకు కారణంగా కేఎల్ రాహుల్ నాణ్యమైన ఓపెనర్‌గా గుర్తింపు పొందడమేనన్నాడు. ఇటీవలికాలంలో శుభ్‌మన్ గిల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడని, కేఎల్ రాహుల్‌ను తప్పించి శుభ్‌మన్‌ను ఆడించాలని మాజీ క్రికెటర్లు నుంచి ఒత్తిడి ఎదురౌతున్నా.. సెలెక్టర్లు, కెప్టెన్, కోచ్ అతనిపై నమ్మకముంచారని పేర్కొన్నాడు.
- మూడో టెస్ట్‌కు ఇండోర్ సిద్ధం
తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల ఫలితం మూడురోజుల్లోనే రావడం, ఆ పిచ్‌ల నాణ్యతపై ఐసిసి రేటింగ్ ప్రకటించిన నేపథ్యంలో మూడో టెస్ట్ బ్యాటర్స్‌కు అనుకూలించే పిచ్ తయారు చేస్తున్నట్లు సమాచారం. మూడో టెస్ట్ జరిగే ఇండోర్‌లోని హోల్డర్ స్టేడియం తొలి రోజు తొలి సెషన్ బౌలర్లకు అనుకూలంగా ఉన్నా.. క్రమంగా బ్యాటర్స్‌కు సహకరించనుంది. ఇక చివరి రెండు రోజులు పూర్తిగా బౌలర్లకు సహకరించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.










