అమరావతి: అంగళ్లు ఘటనలో బెయిల్ మంజూరు చేయాలంటూ టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కోసం చంద్రబాబు వెళ్లిన సందర్భంలో చిత్తూరు జిల్లా అంగళ్లు వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై పోలీసులు చంద్రబాబు సహా పలువురు టిడిపి నేతలపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. చంద్రబాబుపై అధికార పార్టీ నేతలే దాడి చేసి వాళ్లే కేసు పెట్టారని న్యాయవాది వాదించారు. రాళ్లు రువ్విన ఘటనలో చంద్రబాబును ఎన్‌ఎస్‌జీ కమాండర్లు కాపాడారని కోర్టుకు తెలిపారు. బాధితుల మీదే పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే చాలా మందికి ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేశారని చెప్పారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.










