లండన్: ఎంసిసి ప్రపంచకప్ క్రికెట్ కమిటీలో జులన్ గోస్వామి సభ్యురాలిగా ఎంపికైంది. జులన్ గోస్వామి, హీథర్ నైట్, ఇయాన్ మోర్గాన్‌లతో కూడిన మహిళల క్రికెట్ కౌన్సిల్(డబ్ల్యుసిసి)లో ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు, అంపైర్లు, మరియు అధికారులతో కూడిన స్వతంత్ర సంస్థ. జులన్ గోస్వామి గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడల్కోలు చెప్పింది. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన వన్డేలో బ్యాటింగ్ చేయడానికి మైదానానికి వచ్చినప్పుడు ఆమెకు గార్డ్స్ ఆఫ్ మానర్‌తో గౌరవించడం జరిగింది. 2002లో టీమిండియా మహిళల జట్టులో అరంగేట్రం చేసిన జులన్ గోస్వామి 12టెస్టులు, 204 వన్డేలు, 68 టి20లు ఆడింది. పేసర్ అయిన జులన్ మూడు ఫార్మాట్‌లలో కలిసి 355 వికెట్లు కైవసం చేసుకుంది. ఇక హీథర్ నైట్ 2016లో ఇంగ్లండ్ మహిళలజట్టు ఐసిసి మహిళల ప్రపంచకప్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించింది. ఆల్‌రౌండర్ అయిన నైట్.. వైట్‌బాల్ క్రికెట్‌లో 5వేల పరుగులతోపాటుపాటు 10 టెస్టుల్లో 705పరుగులు చేసింది. ఇక ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు 2019లో వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. వన్డేల్లో మోర్గాన్ 7వేలకు పైగా పరుగులు చేశాడు. వీరితోపాటు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డబ్ల్యుసిసికి మరో ముగ్గురు కొత్త సభ్యులు రానున్నారు. దుబారులో సమావేశానికి ముందు క్లేర్ కానర్, జస్టిన్ లాంగర్, గ్రేమ్ స్మిత్ పేర్లు దాదాపు ఖరారయ్యాయి.










