జనసేన-టిడిపి కలిసి పనిచేస్తాయి.. బిజెపితో వెళ్లి రిస్క్ తీసుకోలేను : వారాహి విజయయాత్రలో పవన్‌కల్యాణ్
ప్రజాశక్తి- మోపిదేవి (కృష్ణా జిల్లా) : రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన-టిడిపి కలిసి పని చేస్తాయని, మార్పు కావాలని కోరుకుంటే వైసిపిని తరిమి కొట్టడమే మన కర్తవ్యం కావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బిజెపితో వెళ్తే ఎన్ని సీట్లు వస్తాయో తెలియదని, 2024 ఎన్నికల్లో రిస్క్ తీసుకోలేనని, అందుకే టిడిపితో కలిసి వెళ్తున్నానని వివరించారు. నాలుగో విడత వారాహి విజయయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లా అవనిగడ్డ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులను, మద్యపాన నిషేధం అమలు చేస్తానని మహిళలను, మెగా డిఎస్‌సి ప్రకటిస్తానని ఉపాధ్యాయ అభ్యర్థులను, ప్రతి ఏటా జాబ్ కేలండర్ విడుదల చేస్తానని నిరుద్యోగ యువతను జగన్ మోసగించారని విమర్శించారు. ముఖ్యమంత్రి అవకాశం వస్తే తప్పకుండా స్వీకరిస్తానని, సమర్థవంతంగా సుపరిపాలన అందిస్తానని అన్నారు. జగన్ పదేపదే మాట్లాడే 'వై నాట్ 175 కాదు... ఈసారి వచ్చేది 15 స్థానాలు మాత్రమే. చూసుకోండి' అని పేర్కొన్నారు. జగన్ తన మంత్రివర్గాన్నంతా ఒకే సామాజిక తరగతితో నింపేయడం, కాపు సామాజిక నాయకులతో నన్ను తిట్టించడం, నా సినిమాలను ఆపేయడం వల్ల నాకు ఏమీ నష్టం లేదన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిన జగన్... 3.88 లక్షల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి డ్రాప్ అవుట్ అయ్యేలా చేశారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే చేపట్టి తద్వారా వచ్చిన గణాంకాలను తాను చెబుతున్నానని తెలిపారు. ప్రభుత్వానికి దమ్ముంటే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. చుట్టూ కృష్ణా నది పాయల మధ్య విస్తరించిన దివిసీమ ప్రాంతంలో 87 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలున్నాయని, దాదాపు 4.50 లక్షల నివాసాలకు తాగునీటి కొళాయి కనెక్షన్ లేదని జలజీవన్ మిషన్ లెక్కలు చెబుతున్నాయని తెలిపారు.










