Oct 03,2023 15:27
  • చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, చినరాజప్ప ములాఖత్‌

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : టిడిపి అధినేత చంద్రబాబుకు బెయిల్‌ రాకుండా సిఎం జగన్మోహన్‌రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని మాజీ హోం మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రరంలోని కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబును మంగళవారం ఉదయం 11 గంటలకు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, చినరాజప్ప ములాఖత్‌ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు ఈ ములాఖత్‌ జరిగింది. అనంతరం సెంట్రల్‌ జైలు ఎదుట మీడియాతో ఆయన మాట్లాడారు. జైల్లో ఉన్నా రాష్ట్రం నాశనమవుతోందనే బాధలోనే చంద్రబాబు ఉన్నారని తెలిపారు. 'న్యాయ పోరాటం చేద్దాం.. న్యాయంగానే గెలుద్దాం' అని చెప్పారని, అరాచక పాలనపై మరింతగా పోరాడాలని సూచించారని చెప్పారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణను అన్యాయంగా అరెస్టు చేసి గుంటూరుకు తరలించారని, కనీసం మందులు కూడా ఇవ్వనీయకుండా పోలీసులు పాశవికంగా వ్యవహరించారని విమర్శించారు. అందరితో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని చంద్రబాబు ఆదేశించారని, దీని ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు.