విజయనగరం : రాబోయే రోజుల్లో.. వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయని సిఎం జగన్ ప్రకటించారు. శుక్రవారం విజయనగరంలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. విజయనగరంలోని గాజులరేగలో 70 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా మిగతా నాలుగు మెడికల్ కాలేజీలను సిఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిఎం జగన్ మాట్లాడుతూ .... ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థులంతా గొప్ప డాక్టర్లు కావాలని, వారంతా అత్యున్నత స్థాయికి చేరుకోవాలని సిఎం ఆకాంక్షించారు. స్వతంత్రం వచ్చాక ఎపిలో కేవలం 11 మెడికల్ కాలేజీలే ఉన్నాయని, అందుకే ఈ 11 మెడికల్ కాలేజీలకు మరో 17 మెడికల్ కాలేజీలను చేర్చి 28 మెడికల్ కాలేజీల దిశగా అడుగులు వేస్తున్నామని సిఎం తెలిపారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓ మెడికల్ కాలేజీ ఉండబోతోందన్నారు. ఈరోజు ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామని, ఆ మరుసటి ఏడాది మరో ఏడు కాలేజీలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ 17 మెడికల్ కాలేజీలు కట్టడం కోసం దాదాపు రూ.8,480 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ కాలేజీల వల్ల కొత్తగా 2,250 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని, దీంతో.. మొత్తంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4,735 సీట్లకు చేరుతుందని అన్నారు. ఈ ఒక్క ఏడాదే 609 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయని సిఎం తెలిపారు. రాబోయే రోజుల్లో.. వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. గిరిజన ప్రాంతాలతో పాటు వైద్యసదుపాయాలకు దూరంగా మారుమూల ప్రాంతాల్లోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటు ఉండనుందని తెలిపారు. ఎపి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందాలని అందుకే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చామని అన్నారు. హెల్త్ సెక్టార్‌లో 53 వేలమందిని రిక్రూట్ చేశామన్నారు. కొత్తగా 18 నర్సింగ్ కాలేజీలను తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రస్తుత కాలేజీల్లో మౌలిక సదుపాయాల్ని మెరుగుపరుస్తామన్నారు. వైద్య రంగంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.










