కన్నులపండుగగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
రూ.1.26 కోట్లు పలికిన బండ్లగూడ జాగీర్ గణేష్ లడ్డూ
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో:భక్తజన కోలాహలం, డిజె సౌండ్, డప్పు దరువులు, సంప్రదాయ కళాజాతాల నడుమ భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం గురువారం కోలాహలంగా జరిగింది. నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం గురువారం సెలవు ప్రకటించింది. ట్యాంక్‌బండ్, సరూర్ నగర్ చెరువులతోపాటు హైదరాబాద్‌లో 33 చెరువుల్లో నిమజ్జనం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు, జిహెచ్‌ఎంసి అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది దశ మహా విద్యా గణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన 63 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రశాంతంగా జరిగింది. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన ఊరేగింపు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్‌టిఆర్ మార్గ్‌కు చేరుకుంది. మధ్మాహ్నం ఒంటిగంట సమయంలో అంబేద్కర్ విగ్రహం సమీపంలోని నాలుగో నంబర్ క్రేన్ వద్ద భారీ గణేశుడిని నిమజ్జనం చేశారు. బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో జరిగిన వేలంలో వినాయకుడి లడ్డూ ఏకంగా రూ.1.26 కోట్లు ధర పలికింది. బాలాపూర్ లడ్డూను ఈసారి తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27 లక్షలకు దక్కించుకున్నారు. శుక్రవారం వేకువజాము వరకు నిమజ్జనం కొనసాగుతుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు తెలిపారు.










