Mar 16,2023 07:32
  •  పవన్‌ ప్రసంగంలో ఊసేలేని బిసి డిక్లరేషన్‌
  •  ప్రస్తావనకు రాని కాపు రిజర్వేషన్ల

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జనసేన పార్టీ పదో వార్షికోత్సవంలో సుదీర్ఘంగా సాగిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రసంగంలో రాష్ట్రంలో నెలకొన్న పలు కీలకాంశాలపై స్పష్టత లోపించింది. ప్రధాన సామాజిక తరగతులకు సంబంధించిన సమస్యలపై పార్టీ వైఖరి, కార్యాచరణ ప్రణాళిక ప్రకటించకుండానే ప్రసంగాన్ని ముగించారు. ఈ సమావేశాల్లో ఏదో మంచి నిర్ణయం ఉంటుందనే ఉద్దేశంతో అర్థరాత్రి వరకూ ఎదురు చూసిన కాపు, బిసి సామాజిక తరగతులకు ఏమీ ప్రకటించకుండానే ఆపేశారు. రాజకీయ లక్ష్యాల్లోనూ ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవడంతో క్యాడర్‌ కొంత గందరగోళంలో పడింది. ఓటు చీలనివ్వను అనేమాట తప్ప అదెలాగో స్పష్టంగా చెప్పలేదు. ఇప్పటికే బిజెపితో పొత్తులో ఉన్నామని చెబుతూనే టిడిపితోనూ పంచాయతీ నడుపుతున్నారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానిపైనా వివరణ ఇవ్వలేదు. కులంతో తనకు సంబంధం లేదంటూనే తన తల్లిదండ్రుల కుల ప్రస్తావన తీసుకొచ్చారు. పేరుపెట్టి కాపు కుల ప్రస్తావన చేశారు. అదే సామాజికవర్గానికి చెందిన వారు తమకు రిజర్వేషన్ల అంశంపై ఏదైనా ప్రకటన చేస్తారనేమోనని రాత్రి వరకూ ఎదురు చూసి చివరకు నిరాశకు గురయ్యారు. మచిలీపట్నం వార్షికోత్సవ సభలో బిసి డిక్లరేషన్‌ ప్రకటిస్తామని గతంలో చెప్పారు. దానిపైనా పవన్‌ స్పస్టత ఇవ్వలేదు. రాష్ట్ర బిజెపి సరిగా స్పందించలేదని ఒకవైపు చెబుతూ కేంద్ర బిజెపితో సత్సంబంధాలు ఉన్నాయని, మోడీ అంటే గౌరవమని ప్రకటించారు. మైనార్టీలపై దాడులు జరిగితే ఊరుకోనని చెప్పిన పవన్‌ దేశ వ్యాప్తంగా బిజెపి నాయకుల చేస్తున్న మైనార్టీలపై దాడులు హత్యాకాండను ఖండించలేదు. ముఖ్యంగా రాజకీయ అంశాలపై క్లారిటీ లేని ప్రసంగం చేయడంపై జనసేన శ్రేణుల్లోనే నిరాశ కనిపిస్తోంది. జనసేన చట్టసభలో అడుగుపెట్టడం కీలకం. లేనిపక్షంలో క్యాడర్‌ను కాపాడుకోవడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలు, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల కంటే ఎక్కువగా సీట్లు, ఓట్లు అనే అంశంపైనే ప్రసంగం మొత్తాన్ని సాగించారు. బిజెపి రాష్ట్రాలపై పెడుతున్న షరతులు, విధిస్తున్న భారాలపై కనీస స్పందన లేదు. గ్యాస్‌ ధరలు ఇటీవల కాలంలో భారీగా పెంచారు. దాన్నీ ఖండించలేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామన్యుల జీవనం కష్టమవుతోంది. దానికి కారణమైన బిజెపిని పల్లెత్తు మాట అనలేదు. కేంద్ర సంస్కరణల భారాలు మోపుతున్నా వ్యతిరేకించలేకపోయారు.
పట్టణ ప్రాంతాల్లో భారాలు మోపుతున్నా, చిరు వ్యాపారులపై దాడులు జరుగుతున్నా అవేవీ పవన్‌కల్యాణ్‌ దృష్టిలో లేకపోవడం బాధాకరం. పేదల భూములను పవర్‌ ప్రాజెక్టుల పేరుతో పెద్దలకు కట్టబెడుతున్నారు. అతిపెద్ద అదానీ కుంభకోణం అనంతరం రాష్ట్రంలో భూములు కేటాయించినా ఊసెత్తలేని స్థితిలో పవన్‌కల్యాణ్‌ సుదీర్ఘ ప్రసంగం సాగింది. వీటన్నిటినీ వదిలేసి కేవలం ఒకటీ రెండు అంశాలు, వ్యక్తిగత ప్రస్తావనలు చేయడంపై అయన అభిమానుల్లోనే నిరుత్సాహం వ్యక్తమవుతోంది. బిజెపితో కలిసి మైనార్టీలు, దళితులను ఉద్దరిస్తానని చెప్పడాన్ని ఎవరూ విశ్వసించరని, ఇప్పటికైనా పవన్‌కల్యాణ్‌ తన స్పష్టమైన రాజకీయ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.