Sep 24,2023 22:44

ఆయన ఆశయాల సాధనకు కృషి
శతజయంతి సభల్లో వక్తలు
ప్రజాశక్తి- యంత్రాంగం :కొరటాల సత్యనారాయణ ఆదర్శ కమ్యూనిస్టని, నిరంతర అధ్యయనశీలని పలువురు కొనియాడారు. ఆయన ఆశయాల సాధనే కొరటాలకు అర్పించే నిజమైన నివాళని పేర్కొన్నారు. కొరటాల సత్యనారాయణ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు జరపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాశక్తి సిబ్బంది పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి, పొలిట్‌బ్యూరో పూర్వ సభ్యులు కొరటాల సత్యనారాయణ శత జయంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలుచోట్ల ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలు కొనసాగిస్తామని ప్రతినబూనారు. విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జయంతి కార్యక్రమంలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పాతతరానికి, కొత్త తరానికి వారథి కొరటాల అని పేర్కొన్నారు. రైతు ఉద్యమంతో పాటు చేనేతలాంటి వృత్తి సంఘాలు, కౌలు రైతు సంఘాల లాంటివి స్ధాపించి ఆ సంఘాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. నిశితమైన పరిశీలన, పూర్వాపరాలపై అధ్యయనం చేసేవారని, అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను కలిసి సమస్యలపై ఒక నిర్ణయానికి వచ్చేవారని అన్నారు. సమస్య పరిష్కారానికి ఒకవైపు ఉద్యమిస్తూ, మరోవైపు అధికారులతో కలిసి చర్చించేవారని, అవసరమైతే న్యాయపోరాటం చేసేవారని తెలిపారు. కార్యకర్తల పట్ల ఎంతో ఆప్యాయంగా ఉండేవారన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించేవారని గుర్తు చేశారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు ప్రసంగించారు. వడ్డేశ్వరంలోని కామ్రేడ్‌ కొరటాల సత్యనారాయణ, గుంటూరు బాపనయ్య భవన్‌లో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కొరటాల సత్యనారాయణ విద్యార్థి దశ నుండే అనేక ఉద్యమాల్లో పాల్గన్నారని, నిర్బంధాలు, ఆటుపోట్లను ఎదుర్కొని చివరి వరకూ ఆదర్శ కమ్యూనిస్టుగా జీవించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కమ్యూనిస్టు ఉద్యమంపై నిర్బంధాలు ఉధృతంగా ఉన్నాయని, వర్గ పోరాటాల ద్వారానే కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి, ప్రజాశక్తి ఎడిటర్‌ బి.తులసీదాస్‌, ఎపి రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై.కేశవరావు, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, సిఐటియు రాష్ట్ర నాయకులు కె.ఉమామహేశ్వరరావు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ తదితరులు పాల్గన్నారు. గుంటూరులోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రసంగించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రజాశక్తి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కొరటాల శతజయంతి ఉత్సవాల ప్రారంభంలో ప్రజాశక్తి ఎడిటర్‌ బి తులసీదాస్‌ మాట్లాడారు. ప్రజాశక్తి దినపత్రికను అన్ని వర్గాల ప్రజలకూ చేరువ అయ్యేలా చేయడంతోపాటు విస్తరణకు కొరటాల కృషి చేశారన్నారు. ఆయన స్ఫూర్తితో పత్రికను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజాశక్తి సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిజిఎం వై.అచ్యుతరావు, అసిస్టెంట్‌ ఎడిటర్‌ కె.గడ్డెన్న, న్యూస్‌ ఎడిటర్‌ వి రాజగోపాలశర్మ, జనరల్‌ మేనేజర్‌లు హరికిశోర్‌, తిరుపాల్‌రెడ్డి తదితరులు పాల్గన్నారు.
సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో కొరటాల చిత్రపటానికి పార్టీ సీనియర్‌ నాయకులు విఎస్‌.పద్మనాభరాజు, కొరటాల సత్యనారాయణ కుమారుడు రాధాకృష్ణ, మనవడు విష్ణువర్ణన్‌, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు తదితరులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా అజశర్మ మాట్లాడుతూ వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పోరాటంలో ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదిలేసిన కమ్యూనిస్టు నాయకుల్లో సత్యనారాయణ ఒకరని తెలిపారు. సింహాచలం దేవస్థానం భూ సమస్యను నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి విశేష కృషి చేశారని చెప్పారు. రాధాకృష్ణ మాట్లాడుతూ నాన్న ఆశయాలతో నేటి తరం నాయకులంతా ముందుకెళ్లడం తనకెంతో ఆనందాన్నిస్తోందని తెలిపారు. ప్రజాశక్తి విశాఖ ఎడిషన్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొరటాల గొప్పతనాన్ని వివరించారు. అనంతపురం నగరంలోని గణేనాయక్‌ భవన్‌లో కొరటాల శత జయంతి కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. కొరటాల నిత్య అధ్యయన శీలి, సమస్యల పట్ల సమగ్ర అవగాహన ఉన్న నాయకుడని కొనియాడారు. కొరటాల శత జయంతి సందర్భంగా జెవివి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ జిల్లా కడపలోని రిమ్స్‌ ఆస్పత్రిలో బాలింతల వార్డులో రొట్టెలు పంపిణీ చేశారు. తిరుపతి నగరంలోగల యశోదనగర్‌లోని ఎంబి భవన్‌లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, ధనలక్ష్మి మాట్లాడుతూ కొరటాల సత్యనారాయణ యువతను, విద్యార్థులను ప్రోత్సహించి సిపిఎం ఉద్యమంలోకి వచ్చేలా కృషి చేశారన్నారు. విజయనగరంలోని ఎల్‌బిజి భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ కొరటాల స్ఫూర్తితో పేద, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, పేదల రాజ్యం కోసం ఉద్యమించాలని కోరారు. శ్రీకాకుళంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో కొరటాల సత్యనారాయణ ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజాశక్తి కార్యాలయంలో కొరటాల చిత్రపటానికి ఎడిషన్‌ మేనేజర్‌ పి.కామినాయుడు తదితరులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జ్యోతిబాఫూలే విజ్ఞాన కేరద్రంలో జరిగిన సభలో సిపిఎం కృష్ణా జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు మాట్లాడుతూ కొరటాల సత్యనారాయణ జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు.