హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ... శనివారం హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌ల వద్ద ఐటి ఉద్యోగులు నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఉదయం 10.30 - 11.30 గంటల మధ్య మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకూ నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించి శాంతియుత నిరసన చేపట్టాలని నిర్ణయించారు. అయితే, మెట్రో స్టేషన్‌ల వద్ద భారీ నిరసన చేపట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రవేశాల వద్ద బందోబస్తు నిర్వహించి నల్ల చొక్కాలు ధరించిన వారిని లోనికి అనుమతించలేదు. దీంతో మియాపూర్ మెట్రో స్టేషన్‌ను సిబ్బంది కాసేపు తాత్కాలికంగా మూసివేశారు. ఆ తర్వాత ప్రయాణికులను అనుమతించారు. మరోవైపు ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ వద్ద నల్ల టీషర్ట్ వేసుకొని వచ్చిన యువకులను అడ్డుకోవడంతో.. పక్కనే ఉన్న డీ - మార్టులోకి వెళ్లి ఇతర రంగు టీషర్ట్‌లు కొనుగోలు చేసి వచ్చి నిరసన తెలిపారు. 'వీ వాంట్ జస్టిస్' అంటూ వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.










