Sep 23,2023 10:42
  • ఉప్పొంగిన వాగులు
  • రాకపోకలకు అంతరాయం
  • పంటలు మునిగి కొన్నిచోట్ల రైతులకు నష్టం

ప్రజాశక్తి- నంద్యాల విలేకరులు : నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆత్మకూరు మండలంలో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల నుండి6 గంటల వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. మండలంలో 77.4 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది. ఆత్మకూరు పట్టణంలో ఈ వర్షం వల్ల పలు కాలనీలోని డ్రైనేజీ కాలువలో ఉన్న మురికి నీరు అంతా రోడ్డుపై చేరాయి. వర్షపు నీరు, మురికి నీటి మధ్య పాదసంచారకులు తీవ్ర ఇబ్బందులకు గురి కావలసిన పరిస్థితి ఏర్పడింది. లోతట్టు కాలనీలో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయాయి. మండలంలో ఎండిపోయే దశలో ఉన్న పంట పొలాలకు ఈ వర్షం జీవం పోసినట్లు అయిందని పలువురు రైతులు ఆనందాన్ని వ్యక్తపరిచారు. మహానంది మండలంలోని బోయలకుంట్ల మహానంది క్షేత్రానికి వెళ్లే రహదారిలోని పాలేరు వాగు గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఉప్పొంగి నిండుకుండలా ప్రవహిస్తోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు, ఈ దారిలో మహానందికి వెళ్లే భక్తులు ప్రయాణంలో అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది. పాలేరు వాగు వరద ప్రవాహంతో గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాగు వంతెనపై నుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి. ఈ దారిన రాకపోకలు సాగించే యాత్రికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సంజామల మండలంలో గురువారం రాత్రి నాలుగు గంటల పాటు ఏకధాటిగా వర్షం కొరియడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మిరప, జొన్న తదితర పంటలు నీట మునగాయి. తీవ్రం నష్టం వాటిల్లినట్టు రైతులు శేన్‌ బాషా, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు తెలిపారు. పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మండలంలోని వసంతాపురం, కమలాపురి, ముదిగేడు, ఎగ్గొని సంజామల గ్రామాల్లోని రైతులు పాలేరు వెంబడి వరి పైరు వేశారు. దీనితో పాలే లేరు వాగు వెంబడి ఉన్న వరి పైరు పూర్తిగా నీట మునిగింది. రుద్రవరం మండలంలో కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. రబీ సీజన్లో రైతులు సాగు చేసిన జొన్న పంట నీట మునిగగా.. కొన్నచోట్ల కోత కోసిన మొక్కజొన్న పంట తడిసిపోయింది. మండల పరిధిలో దాదాపు 10 సెంటీమీటర్ల దాకా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏడాదిగాను ఇప్పుడు కురిసిన వర్షం పెద్ద వర్షం కావడంతో వంకలు వాగుల్లో నీరు సమృద్ధిగా పారింది. ఎరుగుడిదిన్నె, పేరూరు ,చిలకలూరు, గ్రామాల సమీపంలో ఉన్న వక్కిలేరు వాగు పొంగి ప్రవహించడంతో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్‌ కొత్తూరు సమీపంలో గత వారం రోజుల క్రితం సాగుచేసిన జొన్న పంట వర్షపు నీరు చేరి పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు సేద్యపు, విత్తనాల ఖర్చులు నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఖరీఫ్‌ సీజన్లో సాగుచేసిన మొక్కజొన్న పంట కోత కోసి రోడ్డుపై ఆరబెట్టడంతో వర్షం కారణంగా కొన్నిచోట్ల తడిసిపోయింది. సిరివెళ్ల రుద్రవరం గ్రామాల మధ్య ఉన్న వాగులు పొంగి ప్రవహించడంతో ఆర్‌టిసి బస్సులు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో నంద్యాల వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం నమోదు కావడంతో పంటలకు ఊపిరి పోసినట్లు అయింది. భూగర్భ జలాలు కూడా పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. పగిడ్యాల మండలంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షం 40. 6 మిల్లీమీటర్లుగా నమోదైనట్టు తహశీల్దార్‌ కార్యాలయ సిబ్బంది తెలిపారు.