Sep 17,2023 07:54

హైదరాబాద్‌ : నేడు హైదరాబాద్‌ నగరంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గతానికి భిన్నంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాంగ్రెస్‌-బిజెపి పార్టీలు పోటాపోటీగా 'సెప్టెంబర్‌ 17' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాల నేపథ్యంలో ... నిన్నటి నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నగరానికి విచ్చేశారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో... పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అటు పరేడ్‌ గ్రౌండ్‌, ఇటు పబ్లిక్‌ గార్డెన్స్‌ కేంద్రంగా ట్రాఫిక్‌ మళ్లింపులు చేస్తున్నారు.