Oct 06,2023 12:14

అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు కస్టడీ, బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ ఎసిబి కోర్టులో మూడో రోజు శుక్రవారం వాదనలు ముగిశాయి. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును సోమవారం నాడు వెల్లడించనున్నట్లు ప్రకటించారు. గురువారం చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను ఈరోజుకు వాయిదా వేసిన సంగతి విదితమే. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే కేసు డైరీ లేకుండా జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించకూడదని తెలిపారు. మరోసారి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని తన వాదనలు వినిపించారు. ఆర్ధిక లావాదేవీలపై చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని ఏపీ సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. బెయిల్‌, కస్టడీ పిటిషన్లకు సంబంధించి ఇరువైపు వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం తీర్పును సోమవారం వెల్లడించనుంది.