ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జగన్ చేసిన నేరాలు రాష్ట్ర ప్రయోజనాలకు ఉరి వేస్తున్నాయని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. అక్రమాస్తుల కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదా వదులుకున్నారని గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. రుషికొండకు గుండు కొట్టిన కేసు తప్పించుకునేందుకు, విశాఖ రైల్యేజోన్‌కు నీళ్లొదిలారని అన్నారు. బాబాయిని చంపేసిన కేసులో తమ్ముడిని రక్షించుకునేందుకు ఏకంగా రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. జగన్ సర్కారు దారుణ వైఫల్యం వల్లే కృష్ణా జలాల కేటాయింపులు పున:సమీక్ష జరుగుతోందని అన్నారు. రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలు తీర్చే కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటా కోల్పోతే రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కృష్ణా జలాల కేటాయింపులో రాష్ట్రానికి తీవ్ర నష్టం : మర్రెడ్డి
సిఎం అసమర్ధత, చేతగాని తనం వల్ల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలుగురైతు విభాగం అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన కేటాయింపులకు విరుద్ధంగా కృష్ణా మిగులు జలాల్లో ఎక్కువ వాటా ఉందని తెలంగాణ వాదించడం, దీనిపై జగన్ మౌనం వహించడం ముమ్మాటికీ రాష్ట్రానికి తీరని నష్టం కలిగించడమేనని విమర్శించారు. సుప్రీంకోర్టులో రాష్ట్రం తరపున ప్రభుత్వం సమర్ధవంతంగా వాదనలు వినిపించి రాష్ట్ర రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.










