Oct 14,2023 11:53

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ అశోక్‌ నగర్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అశోక్‌ నగర్‌ హాస్టల్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థిని ప్రవళిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రూమ్‌లో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. స్నేహితులు తిరిగి వచ్చేప్పటికి రూమ్‌లో ఆమె ఉరేసుకొని కనిపించడంతో వారు వెంటనే హాస్టల్‌ నిర్వాహకుడికి, పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను ప్రవళిక మృతదేహాన్ని తీసుకెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు అశోక్‌ నగర్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయడంతోనే వరంగల్‌ కు చెందిన ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రవళిక రాసిన సూసైడ్‌ నోట్‌ అందరినీ కంటతడి పెట్టించింది. ''అమ్మా నన్ను క్షమించండి. నా వల్ల మీరు బాధపడుతూనే ఉన్నారు. నేను చాలా నష్టజాతకురాలిని. జగ్రత్తగా ఉండండి, ఏడవకండి అమ్మా. నన్ను చిన్నప్పటి నుంచి కాళ్లు కిందపెట్టకుండా పెంచారు. నేను మీకు అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా'' అంటూ సూసైడ్‌ లెటర్‌ రాసి చనిపోయింది. అయితే ప్రవళిక ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.